Begin typing your search above and press return to search.

విపక్షాలకు షాక్ ఇచ్చిన దీదీ ...కారణం అదేనంట !

By:  Tupaki Desk   |   9 Jan 2020 10:41 AM GMT
విపక్షాలకు షాక్ ఇచ్చిన దీదీ ...కారణం అదేనంట !
X
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అలాగే , దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ కేంద్రం మాత్రం దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే కేంద్రం ధోరణి చూస్తుంటే ,,మాత్రం ఈ బిల్లులని వెనక్కి తీసుకునే ఆలోచనలో లేనట్టు కనిపిస్తుంది. ఇక తాజాగా ఢిల్లీలోని జేఎన్‌ యూ విద్యార్థులపై దాడులు జరిగిన నేపథ్యంలో విపక్షాలు జనవరి 13న ఢిల్లీలో సమావేశం కానున్నాయి. పార్లమెంటు హౌస్‌ లో జరిగే ఈ సమావేశానికి కాంగ్రెస్ సహా అన్ని విపక్ష పార్టీలు హాజరుకానున్నాయి.

అయితే, ఈ సమావేశానికి తాను హాజరుకావడం లేదంటూ పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం ప్రకటించారు. ఆమె మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం , జాతీయ పౌర పట్టికలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, వామపక్షాలపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌ లో కాంగ్రెస్, సీపీఎంలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు.

ఎన్‌ డీఏ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విపక్షాలు బుధవారం బంద్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, దీనికి పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం దూరంగా ఉంది. భారత్ బంద్ సందర్భంగా మాల్దా ప్రాంతంలో సీపీఎం, కాంగ్రెస్ మద్దతుదారులు వాహనాలకు నిప్పంటించారు. బంద్ సందర్భంగా హింసాత్మక ఘటనలకు పాల్పడటంపై మమత తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విపక్షాల సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. నిరసనలకు బదులు పూర్తిగా జనజీవనాన్ని స్తంభింపజేసి దిగజారుడు రాజకీయాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆమె ఆరోపించారు.