Begin typing your search above and press return to search.

మీకు తెలుసా? హైదరాబాద్ పుట్టిన తేదీ ఎప్పుడంటే?

By:  Tupaki Desk   |   8 Oct 2020 5:45 AM GMT
మీకు తెలుసా? హైదరాబాద్ పుట్టిన తేదీ ఎప్పుడంటే?
X
చాలా మహానగరాలకు లేని ప్రత్యేకతలు హైదరాబాద్ సొంతం. ఎవరైనా కావొచ్చు.. ఏ ప్రాంతం వాసులైనా అయి ఉండొచ్చు.. ఒకసారి వస్తే చాలు.. హైదరాబాద్ అందాలకు ఫిదా కావాల్సిందే. వచ్చిన వారెవరైనా సరే.. అక్కున చేర్చుకోవటంలో హైదరాబాద్ మహానగరానికి మించింది లేదు. రాజు.. పేద తారతమ్యం లేకుండా నిలువ నీడనిచ్చే హైదరాబాద్ మహానగరంలో కోటి మందికి పైనే జనాభా ఉన్నారు. ఇవాళ.. ఇలా ఉన్నప్పటికీ.. ఈ నగరాన్ని ప్రారంభించిన రోజున పరిస్థితి ఏమిటి? ఇంతకీ ఈ మహానగరం పుట్టిన రోజు ఏమై ఉంటుంది? అన్న ప్రశ్నను సంధిస్తే.. మిగిలిన వారి సంగతి తర్వాత హైదరాబాదీయులం అని గర్వంగా చెప్పే చాలామంది సమాధానం చెప్పలేరు. ఇంతకీ హైదరాబాద్ మహానగర పుట్టిన రోజు ఎప్పుడు? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తుందో సంస్థ.. ఆ వివరాల్లోకి వెళితే..

భాగ్యనగర నిర్మాణం మొదలైన సంవత్సరంగా 1591 మంది అని చెబుతారు. కానీ.. పుట్టిన రోజు (శంకుస్థాపన తేదీ) ఎప్పుడు అంటే మాత్రం తెలీదనే సమాధానం శస్తుంది. మహ్మద్ కులీ ఆలోచనలతో.. ఇరానీ ఆర్కిటెక్టు మీర్ మోమిన్ సృజన నుంచి పురుడుపోసుకున్న ఈ మహానగరం ప్రారంభాన.. సదరు రాజు ఏం కోరుకున్నారో తెలుసా? ‘‘హె అల్లా.. చేపలతో చెరువు ఎలా అయితే కళకళలాడుతుందో.. నా నగరాన్ని ప్రజలతో నింపేయ్’’ అని కోరుకున్నారట.

ముహుర్తబలమే కావొచ్చు.. రాజు వారి కోరిక తీరింది. ఇంతకీ నగర పుట్టిన రోజు ఎప్పుడన్న విషయాన్ని పలు పరిశోధనలు చేసి చివరకు ఈ రోజే (అక్టోబరు 8) అని తేల్చారు. 1591 అక్టోబరు 7న మహానగరానికి జన్మదినమని హైదరాబాద్ ట్రైల్స్ సంస్థ చెబుతోంది. ఈ సంస్థ నిర్వాహఖుడు గోపాల క్రిష్ణ చెబుతున్న దాని ప్రకారం ఒక ఫర్మానాలో పొందుపరిచిన ఆధారాల ఆధారంగా ఈ విషయాన్ని తాము చెబుతున్నామంటున్నారు. చంద్రుడు సింహరాసిలోకి ప్రవేశించి.. బృహస్పతి స్వస్థానంలోకి వెళ్లడంతో పాటు అన్ని గ్రహాలు అనుకూలమైన స్థానాల్లో ఉన్న శుభముహూర్తాన భాగ్యనగరికి పునాది పడినట్లుగా తేల్చారు.

ఫర్మానాలోని గ్రహస్థితి ఆధారంగా ఖగోళ శాస్త్ర నిపుణులు అక్టోబరు ఏడును హైదరాబాద్ పుట్టిన రోజుగా డిసైడ్ చేశారు. ఐదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా.. పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. దీనికి తోడు ఈ డేట్ మీద కొంతమంది భిన్న వాదనలు వినిపిస్తున్నారు. అలా.. అని మరి వారు ఏదైనా డేట్ చెబుతున్నారా? అంటే అదీ లేదు. మొత్తంగా చూసినప్పుడు.. హైదరాబాద్ పుట్టిన రోజు ఇవాళగా చెప్పొచ్చు. ఇంతకీ ఇవాళ ఎన్నో పుట్టిన రోజు అంటారా? 429 నిండి.. 430 సంవత్సరంలోకి నగరం ప్రవేశిస్తోంది. హ్యాపీ బర్త్ డే హైదరాబాద్.