Begin typing your search above and press return to search.

ఉపాస‌న కొత్త ఉద్యోగం గురించి తెలుసా?

By:  Tupaki Desk   |   24 Jan 2019 12:50 PM GMT
ఉపాస‌న కొత్త ఉద్యోగం గురించి తెలుసా?
X
ఇవాల్టి రోజున తెలంగాణ‌లో కేటీఆర్ ఎంత ప‌వ‌ర్ ఫుల్ అన్న విష‌యాన్ని చెప్పే ఉదంతంగా దీన్ని చెప్పొచ్చు. చూసేందుకు ట్వీట్ లా క‌నిపించినా.. తెలంగాణ రాష్ట్రం కోసం తాను చేసిన ప‌ని గురించి చెప్పుకోవ‌టం చూస్తే.. ఆస‌క్తిక‌రంగానే కాదు.. తెలంగాణలో ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న విష‌యం ఇట్టే అర్థం కాక మాన‌దు.

ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రెండు రాష్ట్రాల్లోనూ ఒక ప్ర‌ముఖ కుటుంబానికి చెందిన వారు ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప్ర‌చార‌క‌ర్త‌గా ప్ర‌పంచ స్థాయి వేదిక మీద ప‌ని చేసింది లేదు. దాన్ని సొంతం చేసుకున్నారు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న‌గా చెప్పాలి. వేలాది మందికి కొలువులు ఇచ్చే స్థాయి ఉన్న ఆమె.. తాను చేస్తున్న‌కొత్త ఉద్యోగం గురించి ట్వీట్ తో చెప్పారు.

అంద‌రికి చెప్పాల‌నే కంటే కూడా.. కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాల‌న్నట్లుగా ఆమె ట్వీట్ ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇంత‌కూ ఉపాస‌న చేస్తున్న కొత్త ఉద్యోగం ఏంటి? ఆమె ఎందుకు ట్వీట్ చేశారు? తాను చేస్తున్న కొత్త ఉద్యోగం గురించి కేటీఆర్ దృష్టికి ఎందుకు తీసుకెళ్లాల‌నుకున్నార‌న్న‌ది చూస్తే.. దావోస్ లో వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం వార్షిక స‌మావేశం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ కార్య‌క్ర‌మానికి క్ర‌మం త‌ప్ప‌కుండా వెళ్లే వారిలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఉంటారు. ఈసారి ఆయ‌న‌కు బ‌దులుగా ఆయ‌న కుమారుడు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అదే క్ర‌మంలో తెలంగాణ‌కు సంబంధించి కొంద‌రు అధికారులు వెళ్లారు. అయితే.. ఉపాస‌న కూడా వెళ్లారు. తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకునే కంపెనీల‌కు స‌మాచారాన్ని అందించి త‌న వంతు సాయం చేసేందుకు వీలుగా ఉపాస‌న‌.. ఫోరంలోని తెలంగాణ డెస్క్ కు కో ఆర్డినేట‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు.

ఇదే విష‌యాన్ని ఉపాస‌న వెల్ల‌డిస్తూ ట్వీట్ చేశారు. త‌న ట్వీట్ లో.. నా కొత్త ఉద్యోగం ఎలా ఉంది కేటీఆర్ స‌ర్? అంటూ క్వ‌శ్చ‌న్ చేశారు. తాను చేస్తున్న ప‌నికి సంబంధించిన కొన్ని ఫోటోల‌తో పాటు.. మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల‌తో క‌లిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. ఏమైనా తెలంగాణ ప్ర‌భుత్వం కోసం.. ప్ర‌భుత్వ విధానాల్ని ప్ర‌చారం చేయ‌టం కోసం ఉపాస‌న ఎంత క‌ష్ట‌ప‌డుతున్నారో. మ‌రి.. ఆమె క‌ష్టాన్ని.. ఆమె చేసిన ట్వీట్ కు కేటీఆర్ స‌ర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.