Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రు వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేల్ని డ‌మ్మీల్నీ చేసేశారే ?

By:  Tupaki Desk   |   24 Jun 2021 10:30 AM GMT
ఆ ఇద్ద‌రు వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేల్ని డ‌మ్మీల్నీ చేసేశారే ?
X
రాష్ట్రంలో వైసీపీ నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య రాజ‌కీయాలు న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. అన్ని జిల్లాల్లోనూ ఎమ్మెల్యేలు, క్షేత్ర‌స్థాయి నేత‌ల‌తోపాటు ఎంపీల‌తోనూ ఆధిప‌త్య రాజ‌కీయం సాగుతోంది. అయితే.. ఎక్క‌డ చూసినా.. ఎమ్మెల్యేల‌దే డామినేష‌న్ కావ‌డం గ‌మనార్హం. అనంత‌పురం నుంచి చిత్తూరు.. ఇటు నెల్లూరు నుంచి అటు శ్రీకాకుళం వ‌ర‌కు త‌మ నియోజ‌క‌వర్గాల్లో ఎంపీల మాటే చెల్లుబాటు కావ‌డానికి ఎమ్మెల్యేలు ఎంత మాత్రం స‌హించ‌రు. ఎంపీ త‌న వ‌ర్గానికి చిన్న ప‌ద‌వి ఇప్పించుకోవాల‌న్నా ఎమ్మెల్యే రిక‌మెండేష‌న్ త‌ప్ప‌నిస‌రి. అయితే.. దీనికి భిన్నంగా చిత్తూరు, క‌డ‌ప జిల్లాల్లో మాత్రం రాజ‌కీయంగా ఆధిప‌త్య రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారాయి. ఇక్క‌డ గెలిచిన ఎంపీల‌దే అంతా అంటున్నారు స్థానిక నాయ‌కులు. ఇద్ద‌రు ఎంపీలు ఎమ్మెల్యేల‌ను కాద‌ని మరీ అక్క‌డ హ‌వా చెలాయించుకుంటున్నారు.

క‌డ‌ప ఎంపీగా అవినాష్‌రెడ్డి, చిత్తూరు, క‌డ‌ప జిల్లాల ప‌రిధిలోకి వ‌చ్చే రాజంపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి మిథున్‌రెడ్డి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రు వ‌రుస‌గా రెండేసిసార్లు ఎంపీలుగా గెలిచారు. అంతేకాదు.. మిథున్‌రెడ్డి ఏకంగా పార్ల‌మెంట‌రీ పార్టీలో కీల‌క నేత‌గా ఉన్నారు. ఇక‌, ఇద్ద‌రూ కూడా పార్టీలో ముఖ్య‌నేత‌ల‌కు బంధువులు కావ‌డం గ‌మ‌నార్హం. అవినాష్‌రెడ్డి.. సీఎం జ‌గ‌న్ కు క‌జిన్ కావ‌డం గ‌మ‌నార్హం. క‌డ‌ప జిల్లాలో ఆయ‌న ఏం చెప్పినా ఎమ్మెల్యేలు ఎదురు చెప్పే ప‌రిస్థితి లేదు. అవినాష్ అయితే జిల్లా మంత్రి అంజాద్ బాషాను ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయ‌న వేలుపెట్టేసి.. బ‌దిలీల‌ల నుంచి అన్ని చ‌క్క పెట్టేస్తున్నారు.

ఏ ఎమ్మెల్యేకు అయినా ఎంత కోపం ఉన్నా.. బ‌య‌ట‌కు క‌క్క‌లేని ప‌రిస్థితి. ఇక మిథున్‌రెడ్డి ఏకంగా మంత్రి పెద్దిరెడ్డి కుమారుడే కావ‌డం విశేషం. దీంతో ఇటు పార్టీలోను. అటు నియోజ‌క‌వ‌ర్గంలోనూ వారు తిరుగులేని నేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మిథున్‌రెడ్డికి విప్ శ్రీకాంత్‌రెడ్డితో, మ‌ద‌న‌ప‌ల్లి ఎమ్మెల్యేల‌తో పెద్ద గ్యాప్ ఉంది. ఇటీవ‌ల స్థానిక ఎన్నిక‌ల్లో ఆయ‌న వ‌ర్గం పార్టీకి వ్య‌తిరేకంగా సొంతంగా పోటీ చేసింది. శ్రీకాంత్ రెడ్డితో స‌న్నిహితంగా ఉండే మ‌రో ఎమ్మెల్యే మిథున్ రెడ్డి గురించి పైకి చెప్పే ధైర్యం లేక ఆవేద‌న‌తో మిన్న‌కుండి పోతున్నార‌ట‌.

ఏదేమైనా త‌మ‌కు పార్టీలో ఉన్న స్పెషాలిటీ ద్వారా ఈ ఇద్ద‌రూ కూడా దూకుడుగా ముందుకు సాగుతున్నార‌ని.. ఫ‌లితంగా ఎమ్మెల్యేలు దాదాపు డ‌మ్మీలుగా మారిపోయార‌ని పార్టీ నేత‌లే చెబుతున్నారు. ఈ ప‌రిణామాలతో ఎమ్మెల్యేలు ఏమీ చేయ‌లేక‌పోతున్నారు. అలాగ‌ని ఎవ‌రూ అధిష్టానానికి ఫిర్యాదు చేసే సాహ‌సం కానీ.. అస‌లు ఈ విష‌యాన్ని ప‌ట్టించుకునే తీరిక‌కానీ.. లేదట‌. దీంతో ఎంపీల డామినేష‌న్‌కు తిరుగులేకుండా పోయింద‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.