Begin typing your search above and press return to search.

అపుడే సీఎం దాకా సీన్ వచ్చేసిందా... ?

By:  Tupaki Desk   |   4 May 2022 2:30 PM GMT
అపుడే  సీఎం దాకా సీన్ వచ్చేసిందా... ?
X
ఏ రాజకీయ పార్టీకి అయినా అధికారమే పరమావధి. దాని కోసమే ఎవరైనా అర్రులు చాస్తారు. ప్రజా సేవలోకి వచ్చారు అంటే కుర్చీ ఎక్కడమే లక్ష్యం గా పెట్టుకున్నారు. ఇక తెలంగాణాలో చూసుకుంటే బీజేపీ తమదే పవర్ అని చెబుతోంది. ఎపుడు ఎన్నికలు వచ్చినా టీయారెస్ ఇంటికెళ్ళడం ఖాయమని ఆ ప్లేస్ లో తామే అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతోంది.

ఇక తెలంగాణాలో మూడవసారి టీయారెస్ అధికారంలోకి వస్తుందా అంటే కొన్ని డౌట్లు ఉన్నాయి. మొదటి సారి తెలంగాణా ఉద్యమం గట్టెక్కిస్తే రెండవసారి ఆంధ్రా చంద్రబాబు కాంగ్రెస్ పొత్తు బూచితో ఎమోషన్ కి క్రియేట్ చేసి గులాబీ అధినేతలు లాభం పొందారు. అయితే హ్యాట్రిక్ విజయానికి మాత్రం సరైన నినాదం మాత్రం ఈ రోజుకైతే లేదు. దాంతో పాటు ఇన్నేళ్ళ అధికారం తరువాత నాచురల్ గా వచ్చే యాంటీ ఇంకెంబెన్సీని తట్టుకోవడం కూడా బహు కష్టం.

మరో వైపు చూస్తే అన్నీ ఉన్నా కాంగ్రెస్ కి మాత్రం ఐక్యత అనేది లేకుండా పోతోంది. వర్గ పోరుతో కాంగ్రెస్ సతమవుతోంది. రెండు సార్లు ఇప్పటికి ఓడినా ఆ పార్టీ నేతల వైఖరిలో మార్పు రావడంలేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పుంజుకుంటే ఏమో కానీ లేకపోతే తెలంగాణాలో హస్తం పార్టీ మ్యాజిక్ పనిచేయడం అంత సులువు కాదు.

ఇక మిగిలింది బీజేపీ. బీజేపీ గ్రాఫ్ అలా రెండేళ్ళుగా పెరుగుతూ వస్తోంది. దుబ్బాక నుంచి మొదలుపెడితే హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో బలమైన పార్టీగా మారడం, హుజూర్ బాద్ ఎన్నికల్లో కేసీయార్ గురి పెట్టినా కూడా ఈటెల రాజెందర్ గెలవడం వంటివి ఎంతైనా బీజేపీకి బూస్టింగ్ ఇచ్చేవే. ఇపుడు చూస్తే తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ పాదయాత్రను తెలంగాణాలో విస్తృతంగా చేస్తున్నారు.

ఆయన పాదయాత్రకు జనంలో మంచి మద్దతు కూడా లభిస్తోంది. బీజేపీ ఒక విధంగా ఆల్టర్నేషన్ గా మారినా ఆశ్చర్యం లేదన్న చర్చ కూడా వస్తోంది. బీజేపీ వర్సెస్ టీయారెస్ మాటల దాడిని చూస్తే కనుక అధికార పార్టీకి కాషాయం పార్టీ పాదయాత్రతో గుబులు పుట్టించిందనే చెప్పాలి. రానున్న రోజుల్లో అంటే ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న క్రమంలో పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి చేరికలు ఉంటాయని అంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే బీజేపీ అధికారంలోకి వస్తుంది అన్న అంచనాల నేపధ్యంలో ఇపుడు సీఎం అభ్యర్ధి మీద చర్చ ఆ పార్టీలో సాగుతోందిట. తన కాయ కష్టంతో పార్టీ బండిని లాగుతున్న సంజయ్ సీఎం క్యాండిడేట్ అని ఆయన అనుచరులు అంటున్నారు. బలమైన బీసీ అభ్యర్ధిగా ఆరెసెస్ నేపధ్యం కలిగిన నేతగా పార్టీ హై కమాండ్ కి సన్నిహితుడిగా ఉన్న బండికి సీఎం పోస్ట్ రావడం ఖాయం, అదే ధర్మమని వాదించేవారూ ఉన్నారు.

మరో వైపు చూస్తే తెలంగాణాలో పెద్ద సంఖ్యలో ఉన్న రెడ్డి సామాజికవర్గాన్ని అట్రాక్ట్ చేయాలన్నా వారి మద్దతుని కాంగ్రెస్ నుంచి సాలీడ్ గా లాగేసుకోవాలన్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తారు అని కూడా అంటున్నారు. ఇంకో వైపు చూస్తే టీయారెస్ నుంచి రానున్న రోజుల్లో వలసలను ప్రోత్సహించి బీజేపీని బలోపేతం చేస్తే కనుక ఈటెల రాజేందర్ కూడా రేసులోకి వచ్చేస్తాడు అంటున్నారుట. ప్రధానంగా ఈ ముగ్గురు అభ్యర్ధుల అనుచరులు అయితే మావాడే సీఎం అని అపుడే జబ్బలు చరుస్తున్నారుట.

ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుత అసెంబ్లీలో ముచ్చటగా ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే కలిగిన కమలం పార్టీ 2023 ఎన్నికలో 59 సీట్లతో మ్యాజిక్ ఫిగర్ ని సాధించగలదా. మొత్తానికి మొత్తం అభ్యర్ధులను పోటీలో నిలబెట్టగలదా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా ఇది రాజకీయం. జనాలకు కనుక టీయారెస్ మీద మొహం మొత్తితే కాంగ్రెస్ లో గొడవలను వర్గ పోరును ఈసడించుకుంటే కచ్చితంగా బీజేపీకి చాన్స్ ఉంటుంది అన్న విశ్లేషణలు అయితే ఉన్నాయి.