Begin typing your search above and press return to search.

రేవంత్ పీసీసీ చీఫ్ పదవి కేసీఆర్ వల్లే వచ్చిందా?

By:  Tupaki Desk   |   25 Oct 2021 5:22 AM GMT
రేవంత్ పీసీసీ చీఫ్ పదవి కేసీఆర్ వల్లే వచ్చిందా?
X
ఆసక్తికర వ్యాఖ్య చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తనకు ఈ కీలకమైన పదవిని ఇవ్వటానికి కారణం.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆలోచన తీరు.. ఆయన అనుసరిస్తున్న విధానాలతో కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచనల్లో వచ్చిన మార్పు తనకు ఈ పదవిని అప్పజెప్పినట్లుగా వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర ఫైర్ బ్రాండ్ నేతతల్లో ఒకరైన రేవంత్ రెడ్డి. తాజాగా ఆయన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. తనకు టీపీసీసీ చీఫ్ పదవిని అప్పజెప్పటానికి కారణమైన పరిస్థితుల గురించి రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్ని.. ఆయన మాటల్లోనే చూస్తే..

పార్టీలోని హేమాహేమీల్ని కాకుండా టీపీసీసీ చీఫ్ పదవికి నన్ను ఎంపిక చేయటానికి కారణం నేను కాదు. నాకు అంతటి శక్తి లేదు. రాహుల్ గాంధీ ప్రత్యేకమైన ఆలోచనతో సోనియాగాంధీని ఒప్పించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరీ ఒప్పించారు. ఆయన వ్యక్తిగతంగా చొరవ చూపి ముందుకు తీసుకెళ్లారు. ఈ విషయంలో నా పాత్ర చాలా పరిమితం.

- ఇక్కడ కేసీఆర్‌ సృష్టించిన అగాధం, కాంగ్రెస్‌లోని అగ్ర నాయకత్వాన్నంతా తీసుకెళ్లి దొడ్లో కట్టేయడంతో ఇక్కడ వ్యాక్యూమ్‌ వచ్చింది. ఒకరకంగా నాకు ఈ అవకాశం రావడానికి పరోక్షంగా కేసీఆరే కారణం. ప్రశ్నించేవారే ఉండొద్దన్న పరిస్థితిని కేసీఆర్‌ తీసుకొచ్చారు.

- ప్రత్యామ్నాయం లేకుండా, ప్రశ్నించేవారు లేకుండా చేయడం, పెద్ద నాయకులను ఓడగొట్టడం, కేసులతో బెదిరించడంతో.. ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా? అన్న ఉద్దేశంతో కొందరు హుందాగా పక్కకు తప్పుకొన్నారు. దీంతో ప్రశ్నించేవారు ఎవరో ఒకరు ఉండాలన్న పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్‌ నా మీద మరీ కసితో వ్యవహరించి, ఇంట్లో పడుకున్నా లాక్కెళ్లి బజారున పడేసి, జైల్లో పెట్టించి, రోడ్లమీద పడేసి.. 108 కేసులు పెట్టారు.

- నావల్ల వీడొకడు వచ్చాడని ఆయనకు ఆయనే చెంపలు వేసుకోవాల్సి ఉంటుంది. రాహుల్‌గాంధీ ఒక గొప్ప నమ్మకంతో నాకు అవకాశం ఇవ్వడం కాంగ్రెస్‌ అధిష్ఠానం మారిన వైఖరికి నిదర్శనం. కాంగ్రెస్‌ నిర్ణయాల్లో గుణాత్మకమైన మార్పు వచ్చింది. అవసరమైతే సంప్రదాయాలకు భిన్నంగా కూడా వెళతామని చాటినట్లయింది.

- పంజాబ్‌లో ఒక మహారాజును తప్పించి దళితుణ్ని సీఎంను చేయడం గొప్ప నిర్ణయం. అణగారిన వర్గాలు, పేదల పట్ల నాయకుడిగా రాహుల్‌గాంధీ నిబద్ధతకు ఇది నిదర్శనం. అరాచకం పెరిగిపోయినప్పుడు పార్టీలో కొట్లాడడానికి ఎటువంటి వెసులుబాటు కల్పించాలన్న ఆయన నిర్ణయాల్లో గొప్పతనం. ఇవి ఆషామాషీ పరిణామాలేమీ కాదు. కేసీఆర్‌కు సంబంధించినంత వరకు స్వయంకృతాపరాధం.