Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ ఉప ఎన్నికపై కేసీఆర్ కు ఇంటెలిజెన్స్‌ రిపోర్టు అలా చెప్పిందా?

By:  Tupaki Desk   |   2 July 2021 4:30 AM GMT
హుజూరాబాద్ ఉప ఎన్నికపై కేసీఆర్ కు ఇంటెలిజెన్స్‌ రిపోర్టు అలా చెప్పిందా?
X
మరికొద్ది నెలల్లో జరగాల్సిన హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి రాజకీయ వేడి ఇప్పటి నుంచే షురూ అయ్యింది. ప్రతి విషయాన్ని ఆ ఉప ఎన్నికకే ముడి పెట్టేస్తున్నారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న పలు నిర్ణయాలకు కారణం రాబోయే రోజుల్లో జరగనున్న ఉప ఎన్నికగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈటల రాజేందర్ రోజువారీ ప్రచారాన్ని షురూ చేయటమే కాదు.. అన్ని వర్గాల వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారీ సీఎం కేసీఆర్ అండ్ కో పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. తాజాగా.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వంతు వచ్చింది.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నధీమాను వ్యక్తం చేశారు. పనిలో పనిగా టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదంటూ ఓవర్ కాన్ఫిడెన్సు వ్యాఖ్యలు చేశారు. ఓవైపు కారు పార్టీ గెలిచే అవకాశమే లేదన్న ఆయన మరోవైపు అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేయటం విశేషం. కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసినా టీఆర్ఎస్ గెలవబోదని.. ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని టీఆర్ఎస్ వారికి తెలుసన్నారు. ఈటల మద్దతుదారులపై తప్పుడు కేసులు పెడుతున్నారని.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

సొంత పార్టీ నేతల్ని టీఆర్ఎస్ నాయకత్వం డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తుందని చెప్పటం ద్వారా.. హుజురాబాద్ ఉప ఎన్నికను టీఆర్ఎస్ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్న విషయం చెప్పకనే చెప్పినట్లైంది. మరిన్నికార్యక్రమాలు చేపడుతున్న తర్వాత గెలుపు విషయాన్ని పక్కన పెడితే.. డిపాజిట్లు రాకుండా ఎందుకు ఉంటాయన్నది ప్రశ్న.

ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపిన ఇంటెలిజెన్స్‌ నివేదికలోనూ ఇదే విషయానని పేర్కొన్నట్లు బండి సంజయ్ చెప్పారు. ఈ ఉప ఎన్నికలో ఇంటెలిజెన్స్‌ అధికారుల ప్రస్తావన పదే పదే రావటం గమనార్హం. మొన్నటికి మొన్న ఈటల మాట్లాడుతూ.. నియోజకవర్గంలో నిఘా అధికారుల్ని దండిగా మొహరించారని.. కింది స్థాయి నేతల వద్దకు వెళ్లి వారిని బెదిరిస్తున్నట్లుగా ఆరోపణలు చేశారు. మొత్తానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలకు ముందే రాజకీయ వాతావరణాన్ని వాడివేడిగా మార్చేస్తున్న వైనం చూస్తుంటే.. ఉప ఎన్నిక సమయంలో మరెలాంటి పరిస్థితి నెలకొంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.