Begin typing your search above and press return to search.

ఢిల్లీ లిక్కర్ కేసు : డిప్యూటీ సీఎం 18 ఫోన్లు మార్చాడా?

By:  Tupaki Desk   |   27 Feb 2023 3:12 PM GMT
ఢిల్లీ లిక్కర్ కేసు : డిప్యూటీ సీఎం 18 ఫోన్లు మార్చాడా?
X
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆదివారం సీబీఐ ఎదుట హాజరైన ఆయనను అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది..

సిసోడియా దర్యాప్తు సమయంలో దర్యాప్తు సంస్థ అధికారులకు సహకరించలేదని.. అందుకే అరెస్ట్ చేస్తున్నట్టు సీబీఐ తెలిపింది. "అధికారులు తనపై వేసిన అనేక ప్రశ్నలను సిసోడియా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అతను అందించిన సమాచారం సరిపోదు. కానీ మద్యం పాలసీ రూపకల్పనలో అతను కీలక పాత్ర పోషించాడు. మరింత సమాచారం రాబట్టేందుకు అతడిని అరెస్టు చేశాం" అని సీబీఐ వర్గాలు తెలిపాయి.

అయితే సిసోడియాపై సీబీఐ జరిపిన విచారణకు సంబంధించిన కీలక సమాచారం బయటకు వచ్చింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం ఈ కుంభకోణం వేళ 18 మొబైల్ ఫోన్‌లను ఉపయోగించారని.. నాలుగు వేర్వేరు కాంటాక్ట్ నంబర్‌లను కలిగి ఉన్నారని సీబీఐ ఆరోపిస్తోంది. ఒకే రోజులో సిసోడియా మూడు ఫోన్‌లను మార్చాడని.. అతను ఉపయోగించిన 18 ఫోన్‌లలో ఒకదానిని ధ్వంసం చేసి సాక్ష్యాలను దెబ్బతీసాడని సీబీఐ అంటోంది.

ఈ ఉదయం సిసోడియాకు సిబిఐ వైద్య పరీక్షలు నిర్వహించి రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనుంది. సిసోడియాను కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అభ్యర్థించడంతో పాటు విచారణను ముమ్మరం చేయనుంది.

సిసోడియా అరెస్టు ఎపిసోడ్‌లో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. సిబిఐ అతని పేరును నిందితుడిగా ఛార్జిషీట్‌లో చేర్చలేదు. అయితే అతనిపై విశ్వసనీయమైన సాక్ష్యాలను సేకరించిన తర్వాత మాత్రమే సిబిఐ అతనిని అదుపులోకి తీసుకుందని సమాచారం..

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఇప్పటివరకు 11 మందిని అరెస్టు చేశారు. వైసీపీ ఎంపీ మాగుంట తనయుడు రాఘవరెడ్డి ఇటీవల అరెస్ట్‌ అయ్యారు. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా సిబిఐ ప్రశ్నించింది. కొన్ని మీడియా నివేదికలు అరెస్టు చేయబోయే తదుపరి వ్యక్తి కవిత కావచ్చునని ప్రచారం చేస్తున్నాయి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.