Begin typing your search above and press return to search.

రాజ్ భవన్ మీదనే ఆ సీఎం నిఘా పెట్టించారా?

By:  Tupaki Desk   |   17 Aug 2020 7:30 AM GMT
రాజ్ భవన్ మీదనే ఆ సీఎం నిఘా పెట్టించారా?
X
మరో సంచలనం చోటు చేసుకుంది. ఒక రాష్ట్ర గవర్నర్.. రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఇటీవల కాలంలో ఎప్పుడూ వినని సంచలన ఆరోపణలు చేశారు. రాజ్ భవన్ మీద ముఖ్యమంత్రి నిఘా పెట్టించారంటూ చేసిన ఆరోపణ ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇంతకీ ఈ ఆరోపణలు చేసిన రాష్ట్ర గవర్నర్ ఎవరంటారా? అక్కడికే వస్తున్నాం. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్ లో ఈ పరిస్థితి నెలకొంది. ఆ రాష్ట్ర గవర్నర్ ధన్కర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్ కు.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య సరైన సంబంధాలు లేవన్న సంగతి తెలిసిందే.

ఇలాంటివేళ.. ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్ మీద కొందరు నిఘా పెట్టారని.. నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటారన్నారు. ఈ విషయాన్ని తానెంతో బరువైన హృదయంతో చెబుతున్నట్లుగా పేర్కొని సంచలనంగా మారారు. ఈ సందర్భంగా ఆయన మమత సర్కారు మీద తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. ఈ తరహా నిఘాను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్న ఆయన.. నిఘా పెట్టిన వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు.

నిఘా పెట్టిన వారికి సంబంధించిన జాబితాను అధికారులు సిద్ధం చేశారని.. తాను పచ్చజెండా ఊపిన వెంటనే వారు ఆ జాబితాను విడుదల చేస్తారంటూ ఉత్కంటను మరింత పెంచారు. గవర్నర్ చేసిన వ్యాఖ్యలతో బెంగాల్ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర ప్రథమ పౌరుడి మీదనే నిఘా పెట్టటం.. దానికి సంబంధించిన అధికారుల జాబితాను సిద్దం కావటం చూస్తే.. రానున్న రోజుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనన భావన కలుగక మానదు. ఇదిలా ఉండగా.. బెంగాల్ గవర్నర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యంగ్యంగా ఉన్న ఈ ట్వీట్ లోని విషయంలోకి వెళితే.. పంద్రాగస్టు రోజున రాజ్ భవన్ లో నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి మమత గైర్హాజరు అయ్యారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆమె వ్యంగ్య ట్వీట్ చేశారు. ఎట్ హోం సందర్భంగా రాజ్ భవన్ అధికారులు గవర్నర్ తో పాటు.. ముఖ్యమంత్రి కి ఒక కుర్చీని వేశారు. దాని మీద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్న స్టిక్కర్ అతికించి ఉంచారు.

ఎట్ హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి రాకపోవటంతో.. తనకు కేటాయించిన కుర్చీలో గవర్నర్ కూర్చోగా.. దానికి కాస్త పక్కనే ఉన్న సీఎం కుర్చీ ఖాళీగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.‘‘ఈ ఖాళీ సీటు చూస్తేనే అర్థమవుతుంది. ఈ సంస్కృతి ఎంతో గొప్పదైన బెంగాల్ సంస్కృతికి ఏ మాత్రం సరిపోదు. సీఎం గైర్హాజరు తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది ఈ దేశానికి స్వాతంత్య్రం కోసం కృషి చేసి.. ప్రాణాలు అర్పించిన వారిని గుర్తు చేసుకునే సందర్భంగా పేర్కొన్నారు. తనకు మాటలు రావటం లేదంటూ పేర్కొనటం ద్వారా ముఖ్యమంత్రి మమతను ఆత్మరక్షణలో పడేసేలా ట్వీట్ చేశారు. ఇలా వరుస ఉదంతాలతో బెంగాల్ లో పరిస్థితులు అనూహ్యంగా మారాయని చెప్పక తప్పదు.