Begin typing your search above and press return to search.

ఎంపీ వాగ్మూలాన్నీ సీబీఐ మార్చేసిందా ?

By:  Tupaki Desk   |   10 March 2023 11:36 AM GMT
ఎంపీ వాగ్మూలాన్నీ సీబీఐ మార్చేసిందా ?
X
వివేకానందరెడ్డి హత్య కేసు మిస్టరీ ఎప్పటికి వీడుతుందో తెలీదు కానీ విచారణ దశలోనే అనేక సంచలనాలను నమోదుచేస్తోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి కోర్టులో వేసిన పిటీషన్లోని అంశాలు ఆశ్చర్యంగా ఉన్నాయి. తన పిటీషన్లో నాలుగు అంశాలను ప్రస్తావించారు. మొదటిదేమో సీబీఐ తనపై సీరియస్ యాక్షన్ తీసుకోకుండా నిలువరించాలని. రెండోది తన విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని. మూడోది తన వాంగ్మూలం కాపీని తనకు అక్కడికక్కడే అందించాలని. నాలుగోదేమో విచారణ సందర్భంగా తన లాయర్ ను అనుమతించాలని.

పై నాలుగు అంశాల్లో కీలకమైనవి ఏమిటంటే విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని, తన వాంగ్మూలం కాపీని వెంటనే తనకు అందించాలని. ఎంపీ ఎందుకింతగా పట్టుబడుతున్నట్లు ? ఎందుకంటే ఎంపీని సీబీఐ విచారించటం ఇది మూడోసారి. గతంలో చేసిన విచారణ సందర్భంగా తాను చెప్పిన అంశాలను విచారణాధికారి మార్చేశారట. విచారణలో తాను ఒకటి చెబితే దానికి విరుద్ధంగా సీబీఐ మార్చుకున్నట్లు ఎంపీ ఆరోపిస్తున్నారు.

ఇలాంటి ఆరోపణలనే గతంలో మరికొందరు కూడా చేసిన విషయం తెలిసిందే. విచారణ మొత్తాన్ని పూసగుచ్చినట్లు మెజారిటి మీడియాలో వెలుగుచూస్తోంది. ఆ సందర్భంగా కొందరు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. విచారణలో సీబీఐ తమను అడగని, తాము చెప్పని అంశాలను చెప్పినట్లుగా మీడియాలో వచ్చాయని కొందరు గోలగోల చేశారు. ఇదే విషయమై స్వయంగా వైఎస్ షర్మిల కూడా మండిపడిన విషయం తెలిసిందే.

విచారణలో తాను చెప్పని విషయాలు చెప్పినట్లుగా మీడియాలో రావటంపై షర్మిల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. బహుశా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఇపుడు ఎంపీ ఆడియో, వీడియో రికార్డింగని, వాంగ్మూలం కాపీని వెంటనే తనకు అందించేలా సీబీఐని ఆదేశించమని కోర్టును రిక్వెస్టు చేసుకున్నారు. మరి ఎంపీ పిటీషన్ పై కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది ? కోర్టు ఆదేశాలపై సీబీఐ రెస్పాన్స్ ఏ విధంగా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది. మొత్తంమీద వివేకా హత్యకేసులో సూత్రదారులు, పాత్రదారులు ఎవరనేది ఎప్పటికి తేలుతుందో ?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.