Begin typing your search above and press return to search.

అప్పుడే ట్రంప్ ని బీజేపీ టార్గెట్ చేసిందా?

By:  Tupaki Desk   |   6 Nov 2020 7:10 AM GMT
అప్పుడే ట్రంప్ ని బీజేపీ టార్గెట్ చేసిందా?
X
నిజంగా ఈ రాజకీయాలు ఉన్నాయే.. ఏరుదాటాక తెప్ప తగలేయడం అంటే ఇదే కాబోలు.. అవసరార్థం వాడుకొని లబ్ధి పొందడం.. తేడా కొడితే విసిరిపారేయడం రాజకీయ నేతలకు అలవాటు.. ఇప్పుడు బీజేపీ కూడా అదే బాటలో నడుస్తోంది..

పాపం.. ట్రంప్.. రెండోసారి గెలుస్తాడని బోలెడు ఆశలు పెంచుకున్నారు. మన ప్రధాని నరేంద్రమోడీతో ‘హౌడీ మోడీ’ అంటూ ఇండో అమెరికన్లను ఆకర్షించాడు. మోడీ ప్రచారంతో ట్రంప్ కు ఓట్ల వాన కురుస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడక్కడ ట్రెయిన్ రివర్స్ అవుతోంది. ట్రంప్ ఓడిపోతున్నాడు. పుట్టెడు దు:ఖంలో ఉన్నాడు. ఇన్నాళ్లు మోడీకి డియరెస్ట్ ఫ్రెండ్ అయిన ట్రంప్ ను పొగిడిన బీజేపీ పెద్దలు ఇప్పుడు ఆయన అవసరం తీరిపోవడంతో నోరుపారేసుకుంటున్నారు. ట్రంప్ వైఫల్యాన్ని తమ విజయంగా చెప్పుకుంటుండడం విశేషం.

తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాట్ కామెంట్స్ చేశారు. కరోనా కట్టడిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విఫలమైతే ప్రధాని మోడీ విజయవంతం అయ్యారని జేపీ నడ్డా హాట్ కామెంట్స్ చేశారు. బీహార్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన కరోనా నియంత్రణలో ట్రంప్ సరిగా పనిచేయలేదని.. కానీ ప్రధాని మోడీ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని 130 కోట్ల మంది భారతీయులను కాపాడారని జేపీ నడ్డా తెలిపారు.

రెండుమూడేళ్లుగా ట్రంప్ ను అవసరార్థం ప్రధాని మోడీ బాగా వాడేసుకున్నాడు. చైనా, పాకిస్తాన్ లతో ఫైట్ నేపథ్యంలో అమెరికా సాయం తీసుకున్నారు. ట్రంప్ ను మన దేశ పర్యటనకు తీసుకొచ్చి మోడీ, బీజేపీ పెద్దలు చేసిన హల్ చల్ అంతా ఇంతాకాదు. ట్రంప్ ను ఉపయోగించుకొని దేశంలో బీజేపీ ఇమేజ్ ను భారీగా పెంచుకుంది. అసలు ట్రంప్ అహ్మదాబాద్ పర్యటనతోనే దేశంలో కరోనా వేవ్ మొదలైందన్న విమర్శలు ఉన్నాయి.

కరోనా కట్టడిలో మోడీ పెద్దగా చేసిందేమీ లేదన్న విమర్శ ఉంది. లాక్ డౌన్ విధించడం తప్పితే దేశ ప్రజలకు సాయం చేసింది.. కరోనా కట్టడి చేసింది ఇసుమంతైనా లేదన్నది కరోఠ వాస్తవమని విశ్లేషకులు చెబుతున్నారు. అక్కడ ట్రంప్ ఓడిపోయే సరికి ఇక్కడ బీజేపీ నేతలు ఫ్లేట్ ఫిరాయించారు. ఎన్నికలు లేవు కాబట్టి ఇప్పుడు మోడీ సేఫ్ సైడ్ లో ఉన్నారు. జరిగితే మాత్రం కరోనా కట్టడిలో ఫెయిలైన మోడీకి ఇదే ఫలితం వచ్చేదంటున్నారు. అయినా బీహార్ ఎన్నికల్లో మోడీసార్ పనితనం.. ఈ బీజేపీ నేతల అత్యుత్సాహం సంగతి త్వరలోనే తేలుతుందంటున్నారు.

తొందరపడి ముందే కూస్తున్న బీజేపీ పెద్దలు ఇప్పుడు తమ ఎన్నికల ప్రచారంలో ఓడిపోయిన ట్రంప్ ను అస్త్రంగా మలుచుకోవడం విధి వైచిత్యం. నిజానికి దేశంలో కరోనా కట్టడిలో బీజేపీ పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదన్న విమర్శ ఉంది. దానికి కాలమే సమాధానం చెబుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.