Begin typing your search above and press return to search.

భార‌తీయ జ‌న‌తా పార్టీ సెల్ఫ్ గోల్స్ మొద‌లుపెట్టిందా?

By:  Tupaki Desk   |   19 March 2020 1:30 AM GMT
భార‌తీయ జ‌న‌తా పార్టీ సెల్ఫ్ గోల్స్ మొద‌లుపెట్టిందా?
X
అధికారంలో ఉన్న‌ప్పుడు చాలా మందికి చాలా విష‌యాలు ప‌ట్ట‌వు. త‌మ‌కు ఎదురులేదు అనే త‌త్వంతో ఉంటారు. వ‌ర‌స‌గా రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇప్ప‌టికే దేశ ప్ర‌జ‌ల‌కు స‌మాధానాలు చెప్పుకోవాల్సిన అంశాలు చాలా పెండింగ్ లో ఉన్నాయి. త‌మ ప్ర‌భుత్వం లో అవినీతి లేదు అని మోడీ చెప్పుకుంటున్నారు. అయితే యూపీఏ హ‌యాంతో పోలిస్తే.. ఎన్డీయే హ‌యాంలో ఆర్థిక నేరాల తీవ్ర‌త ఏం త‌గ్గ‌డం లేదు.

ఇక్క‌డ గ‌మ‌నించాల్సింది రాజ‌కీయ నేత‌లు లంచాలు తీసుకుంటున్నారా, మంత్రుల క‌మిష‌న్ల స్థాయి ఎంత ఉంది అనేది కాదు, ఆర్థిక నేరాల గురించి. అవినీతి గ‌ట్టిగా ఉంద‌నుకున్న యూపీఏ హ‌యాంలో ఆ పార్టీ నేత‌లు చాలా మంది అరెస్టు అయ్యారు. సొంత పార్టీ నేత‌ల‌ను తీహార్ జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మిత్ర‌ప‌క్షాల నేత‌ల‌నూ అక్క‌డ‌కే పంపింది. అలాంటి తీరుతో కాంగ్రెస్ పార్టీ సొంత అవినీతికి బ్ర‌హ్మాండ‌మైన ప్ర‌చారం క‌ల్పించింది. చివ‌ర‌కు ఎన్నిక‌ల్లో దెబ్బ‌తింది.

అదే బీజేపీ వ‌చ్చాకా.. అనేక మంది ఆర్థిక నేర‌గాళ్లు విదేశాల‌కు ప‌రార్ అయ్యారు. వివిధ ఆర్థిక నేరాలకు ప‌రిష్కార‌మే చూప‌లేక‌పోతోంది మోడీ స‌ర్కారు. పేరుకు ప‌వ‌ర్ ఫుల్, విదేశాల‌న్నీ తిరిగి సత్సంబంధాల‌ను ఏర్ప‌రిచిన‌ట్టుగా మోడీ చెప్పుకుంటున్నారు. అయితే ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కూ మాల్యాను ఇండియాకు ర‌ప్పించ‌లేక‌పోతున్నారు. అలాగే నీర‌వ్ మోడీని ప‌ట్టుకోలేక‌పోతున్నారు. అవ‌న్నీ చాల‌వ‌న్న‌ట్టుగా య‌స్-బ్యాంకు కుంభ‌కోణం మ‌రోటి. ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల నుంచి నిధులు మ‌ళ్లించ‌డం ఏ మేర‌కు స‌బ‌బో మోడీకి, కేంద్ర ఆర్థిక మంత్రికే తెలియాలి!

ఆ సంగ‌త‌లా ఉంటే.. ఇప్పుడు గొగోయ్ వ్య‌వ‌హారం తో భార‌తీయ జ‌న‌తా పార్టీ అభాసుపాల‌వుతూ ఉంది. ఇటీవ‌లి కాలంలోనే కీల‌క తీర్పులు ఇచ్చిన ఆయ‌న‌కు రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఇవ్వ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఈ విష‌యంలో బీజేపీ ఎదురుదాడి అయితే చేస్తోంది. అయితే ఇదంతా సెల్ఫ్ గోల్ వ్య‌వ‌హార‌మే. ఇప్పుడు గొగోయ్ కు రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఇవ్వ‌క‌పోయినంత మాత్రాన వ్య‌వ‌స్థ‌కు వ‌చ్చిన న‌ష్టం ఏమీ లేదు. అయితే ఇవ్వ‌డం వ‌ల్ల‌..ఆయ‌న ఇచ్చిన తీర్పుల‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇది క‌మ‌లం పార్టీ వాళ్లు ప్ర‌త్య‌ర్థుల‌కు చేజేతులారా ఇస్తున్న అవ‌కాశం లాగుంది! బీజేపీ ఇప్పుడు చాలా ఆత్మ‌విశ్వాసంతో ఉంది. ఇలాంటి స‌మ‌యంలో ఈ ప‌రిణామాలు చోటు చేసుకుంటూ ఉండ‌టం గ‌మ‌నార్హం.