Begin typing your search above and press return to search.

2018 వ్యూహం గ్రేటర్ ఎన్నికల్లో వర్కువుట్ కాలేదా?

By:  Tupaki Desk   |   5 Dec 2020 7:18 AM GMT
2018 వ్యూహం గ్రేటర్ ఎన్నికల్లో వర్కువుట్ కాలేదా?
X
టెక్నికల్ భాషలో చెప్పాలంటే.. ఒక వెర్షన్ కు పరిమితమైన జీవితకాలం ఉంటుంది. ఏళ్లకు ఏళ్లు ఎలాంటి అప్డేట్ లేకుండా ఒకే వెర్షన్ వాడితే.. ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు. రాజకీయాల్లో ఒకసారి ఫలించిన వ్యూహం అన్నిసార్లు వర్కువుట్ కాదు. ఆ విషయాన్ని గుర్తించకుంటే.. గుడ్డిగా ఫాలో అయితే వచ్చే తలనొప్పి ఏమిటో తాజాగా వెల్లడైన గ్రేటర్ ఫలితాన్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

గ్రేటర్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ చేసిన అతి పెద్ద తప్పు 2018 లో ముందస్తు ఎన్నికల సందర్బంగా ఆయన అనుసరించిన వ్యూహాన్ని.. ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా అమలు చేయటమే. అయితే.. అప్పట్లో ఆయన్ను చంద్రబాబు ప్రచారానికి వచ్చి ఆదుకుంటే..ఈసారి ఏ బాబు ఆయన్ను ఆదుకోవటానికి రాలేదు. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళితే..ఆ ఎన్నికల ప్రభావం అంతో ఇంతోతన మీద కూడా పడుతుందన్న ముందస్తు జాగ్రత్తతో.. షెడ్యూల్ కంటే దాదాపు ఆరేడు నెలల ముందే ఎన్నికలకు ఓకే చెప్పేశారు కేసీఆర్. అంతేకాదు.. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో వేళ్ల మీద లెక్కించే వారిని మాత్రమే మార్చి.. పాత టీంను యథాతధంగా పోటీలోకి దింపారు.

అప్పటికే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు.. సిట్టింగ్ అభ్యర్థుల మీద ఉన్న వ్యతిరేకతతో.. గులాబీ పార్టీ పని అయిపోయిందని భావించారు. అనూహ్యంగా కాంగ్రెస్ తో జత కట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు అనుకోని వరంగా కేసీఆర్ కు మారారు. ఆంధ్రా పాలకులు తెలంగాణ అధికార పీఠాన్ని సొంతం చేసుకోవటానికి రంగంలోకిదిగినట్లుగా ఆయన చేసిన ప్రసంగాలు ఫలించి.. అనూహ్య మెజార్టీని సొంతం చేసుకునేలా చేసింది. దీంతో.. తెలంగాణలో టీఆర్ఎస్ తిరుగులేని అధికారపక్షంగా అవతరిస్తే..కాంగ్రెస్ ఉనికి కోసం పోరాటం చేసే దీన స్థితికి చేరింది.

తాజాగా జరిగిన గ్రేటర్ ఎన్నికల్ని చూస్తే.. కాలపరిమితి ఇంకా మూడు నెలలు ఉండగానే.. ముందస్తు ఎన్నికల్ని నిర్వహించారు. అది కూడా.. చడీచప్పుడు లేకుండా హడావుడిగా నిర్వహించిన గ్రేటర్ ఎన్నికల్లో పదిశాతం సీట్లలోనే అభ్యర్థుల్ని మార్చి.. మెజార్టీ సిట్టింగులను బరిలోకి దించారు. 2018 వ్యూహాంలో భాగంగా.. పార్టీ తరఫున బరిలోకి దిగే అభ్యర్థులకు అవసరమైన ఆర్థిక దన్ను పార్టీ నుంచే ఇవ్వటమే కాదు.. ఇంఛార్జిల పేరుతో మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేల్ని దించారు. డివిజన్ మొత్తం జిల్లాల నుంచి తెచ్చిన మనుషులతో నింపేశారు. ఇలా.. 2018 ప్లాన్ ను యథాతధంగా అమలు చేసిన గులాబీ బాస్ కు గ్రేటర్ ఓటర్లు దిమ్మ తిరిగే షాకిచ్చారు.

2018లో కేసీఆర్ చేసిన తప్పులన్ని.. బాబు ఎంట్రీ పుణ్యమా అని మరుగన పడిపోయి.. భావోద్వేగంతో కారుకు జై కొట్టారు.అందుకుభిన్నంగా తాజాగా జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎలాంటి తప్పులు చేయకపోవటం.. కేసీఆర్ తప్పులు హైలెట్ అయి.. ఆయనకు భారీ షాక్ తగిలిన పరిస్థితి. ఇదంతా చూసినప్పుడు 2018లో కేసీఆర్ అనుసరించిన వ్యూహానికి కాస్త మెరుగులు దిద్ది.. సిట్టింగుల్ని మార్చేసి కొత్తవారిని బరిలోకి దించితే.. ఫలితాలు మరింత మెరుగ్గా వచ్చి ఉండేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.