Begin typing your search above and press return to search.

ఉగ్రవాదులు బెంగళూరును టార్గెట్ చేశారా?

By:  Tupaki Desk   |   13 Oct 2020 7:30 AM GMT
ఉగ్రవాదులు బెంగళూరును టార్గెట్ చేశారా?
X
గత నెలలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో డాక్టరుగా ఉన్న బసవగుడి నివాసి అనుమానిత ఐసీస్ ఉగ్రవాది డాక్టర్ అబ్దుల్ రెహమాన్ ఇచ్చిన సమాచారంతో గుర్రప్పనపాళ్యలోని బిస్మిల్లానగర్ లో ఎన్ఐఏ అధికారులు తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే ఏడుగురు యువకులు కొంతకాలంగా కనిపించడం లేదని తేలింది.

వీరంతా సౌదీ అరేబియా ద్వారా ఇరాన్ సరిహద్దుకు చేరుకొని అక్కడి నుంచి సిరియాకు వెళ్లినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ‘మేకింగ్ ఆఫ్ ఫ్యూచర్’ అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఈ అనుమానిత ఉగ్రవాదులు ఓల్డ్ మద్రాస్ రోడ్డులోని ఓ ఇంట్లో శిక్షణ తీసుకున్నట్లు ఎన్ఐఏ గుర్తించినట్లు సమాచారం.

ఎన్ఐఏ అరెస్ట్ చేసిన డాక్టర్ అబ్దుల్ బెంగళూరులో ఉగ్రవాద కార్యకలాపాలను పెంచి పోషించడంలో కీలకంగా వ్యవహరించినట్టు ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. చదువుకున్న యువతను ఐసీస్ లో చేర్చుకొని శిక్షణ ఇచ్చేందుకు ఇక్బాల్ జమీర్, అబ్దుల్ రెహమాన్ బ్యాంకు ఖాతాలకు భారీగా నగదు జమ అయినట్లు ఎన్ఐఏ విచారణలో వెలుగుచూసినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే ఐటీ సిటీ బెంగళూరును ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టు అర్థమవుతోంది. భారత్ లో విధ్వంసం సృష్టించడానికి సిరియాలో శిక్షణ తీసుకున్న ఐదుగురు ఉగ్రవాదులు బెంగళూరులో తిష్ట వేసినట్లు ఎన్ఐఏ గుర్తించినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో బెంగళూరు నగర వాసుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.