Begin typing your search above and press return to search.

ఆ జిల్లా వాసులపై పగ పట్టిన పాములు?

By:  Tupaki Desk   |   13 Jun 2023 9:20 AM GMT
ఆ జిల్లా వాసులపై పగ పట్టిన పాములు?
X
పది కాదు.. ఇరవై కాదు.. వంద కూడా కాడు. ఏకంగా వెయ్యి కేసులు. ఏడాది వ్యవధిలో ఆ జిల్లాలోని వెయ్యి మంది పాముకాటు బారిన పడుతున్నారు. అంతకంతకూ పెరిగిపోతున్న పాము కాట్లకు ఆ జిల్లా ప్రజలు హడలిపోతున్నారు. తమ జిల్లాపై పాములు పగబట్టాయా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇంతకీ ఈ జిల్లా ఉన్నది ఎక్కడంటే.. మహారాష్ట్రలో. ఆ రాష్ట్రంలోని రాయ్ గఢ్ జిల్లాలో గడిచిన ఏడాదిగా పాముకాటు కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్న పరిస్థితి. ఏడాది వ్యవధిలో పద్నాలుగు మంది కేవలం పాముకాటు కారణంగా ప్రాణాలు విడిచారు.

జిల్లాలోని అలీబాగ్.. పన్వేల్.. ఖలాపుర్.. మహాద్.. మంగవూన్ తాలుకాల్లో పాము కాటు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఆ జిల్లాలో 1118 పాముకాటు కేసులు నమోదయ్యాయి. ఎందుకిలా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. సమాధానం దొరకని ఈ ప్రశ్నకు కారణాల్ని అన్వేషిస్తున్నారు. అయితే.. పాముకాటు బారిన పడిన వారు.. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా.. వెంటనే వైద్యాధికారుల్ని సంప్రదించాలని అధికారులు సూచన చేస్తున్నారు.

పాముకాటు గురైన వెంటనే నాటు వైద్యం.. మంత్రాల పేరుతో ఆలస్యం చేయొద్దని కోరుతున్నారు. సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లాలని చెబుతున్నారు. జిల్లాలోని పద్నాలుగు ప్రాథమిక వైద్య కేంద్రాల్లో పాముకాటు చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లు చేసినట్లుగా వెల్లడించారు. ఇంతకీ ఈ జిల్లాలో పాముకాట్లు ఇంత భారీగా ఎందుకు ఉంటున్నాయన్న విషయాన్ని తేల్చాల్సిన అవసరం ఉందని జిల్లా వాసులు కోరుతున్నారు.