Begin typing your search above and press return to search.

షేన్ వార్న్ మరణానికి ముందు మద్యం తాగాడా? అసలు క్లారిటీ ఇదే?

By:  Tupaki Desk   |   6 March 2022 2:57 AM GMT
షేన్ వార్న్ మరణానికి ముందు మద్యం తాగాడా? అసలు క్లారిటీ ఇదే?
X
ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ హఠాన్మరణం క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. థాయ్ లాండ్ విహారంలో ఉన్న షేన్ వార్న్ శుక్రవారం తన విల్లా గదిలో విగత జీవిగా పడి ఉన్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పుడే మరణించాడు. అతడి మృతికి ముందు చివరి క్షణాల్లో ఏం జరిగిందనే దానిపై వార్న్ మేనేజర్ జేమ్స్ ఎక్స్ కిన్ క్లారిటీ ఇచ్చాడు.

మరణించడానికి ముందు షేన్ వార్న్ పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ ను టీవీలో చూశాడని.. మద్యం కూడా తీసుకోలేదని తెలిపాడు. హాలీడే కోసం థాయ్ లాండ్ వెళ్లిన షేన్ వార్న్ బరువు తగ్గేందుకు డైటింగ్ చేస్తున్నాడని తెలిపారు.

'మ్యాచ్ ల కామెంట్రీ కోసం ఇంగ్లండ్ వెళ్లేముందు దొరికిన సమాయాన్ని గడిపేందుకు వార్న్ థాయ్ లాండ్ కు వచ్చాడు. మరణానికి ముందు ఎలాంటి మద్యం తీసుకోలేదు. తన స్నేహితుడు నియోఫిటోతో కలిసి భోజనం చేయాలనుకున్నాడు. సాయంత్రం 5 గంటలకు మరికొంతమందిని వార్న్, నియోఫిటో తో కలిసి కలవాలనుకున్నాడు.

పక్క గదిలోనే ఉన్న నియో వచ్చేసరికి వార్న్ నిర్జీవంగా పడి ఉన్నాడు. అతడికి ఏదో అయ్యిందని నియో భావించాడు. నోటిలో నోరు పెట్టి శ్వాస ఇచ్చేందుకు ప్రయత్నించాడు. 20 నిమిషాలకు ఆంబులెన్స్ వచ్చిందని.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఓ గంట తర్వాత వార్న్ చనిపోయాడనే విషయం తెలిసింది.

మరణానికి రెండు గంటల ముందు చివరగా చూశా.. అతనెక్కువగా మద్యం తాగడం లేదు. బరువు తగ్గేందుకు ఆహార నియమాలు పాటిస్తున్నాడు అని వార్న్ మేనేజర్ జేమ్స్ తెలిపాడు. మరోవైపు ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే వార్న్ ప్రాణాలు పోయాయని థాయ్ అంతర్జాతీయ ఆస్పత్రి వెల్లడించారు.

ఇక షేన్ వార్న్ కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ శనివారం ప్రకటించారు. వార్న్ హఠాన్మరణంతో ఆస్ట్రేలియా ప్రజలు దిగ్బ్రాంతి చెందారు. అధికారిక లాంఛనాలతో వార్న్ అంత్యక్రియలు చేస్తామని.. మా దేశపు అత్యత్తుమ వ్యక్తుల్లో వార్న్ ఒకడు.. క్రికెట్ ఆడేలా ఎంతో మంది అబ్బాయిలు, అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచాడని మోరిసన్ తెలిపారు. విక్టోరియా ప్రభుత్వం ఈ బాధ్యతలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. అంత్యక్రియలు ఎప్పుడూ ఎక్కడా జరుగుతాయో వెల్లడించలేదు.

వార్న్ గౌరవార్థం ఎంసీజీ మైదానంలో 'దిగ్రేట్ సదర్స్ స్టాండ్ కు' అతడి పేరు పెట్టాలనుకుంటున్నట్లు క్రీడల మంత్రి మార్టిన్ ప్రకటించారు. అక్కడి ప్రజలు వార్న్ కు ఇష్టమైన సిగరేట్లు, బీర్లు, బేక్డ్ బీన్స్, పూలు, క్రికెట్ బంతులు విగ్రహం దగ్గర ఉంచి నివాళులర్పించారు.