Begin typing your search above and press return to search.

రోహిత్ శర్మ.. బీఫ్ ఆర్డర్ చేశాడా? కొత్త రచ్చ షురూ

By:  Tupaki Desk   |   4 Jan 2021 3:53 AM GMT
రోహిత్ శర్మ.. బీఫ్ ఆర్డర్ చేశాడా? కొత్త రచ్చ షురూ
X
సరదా సంఘటనను సోషల్ మీడియాలో షేర్ చేయటం.. అనంతరం అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్న వైనం ఇప్పుడు క్రీడాభిమానుల్లోనూ.. క్రీడారంగంలోని పెద్ద చర్చగా మారింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా క్రికెటర్లు.. హోటల్ గదిలో పరిమితం కాకుండా బయటకు రావటం.. పెర్త్ లోని ఒక రెస్టారెంట్ లో భోజనం చేస్తున్న వేళ.. వారి పక్కనే కూర్చున్న భారతీయ అభిమాని ఒకరు.. వారు తిన్న ఫుడ్ కు బిల్లును తాను కట్టేశాడు. ఆ విషయం క్రీడాకారులకు హోటల్ సిబ్బంది చెప్పటం.. వారు నో అని చెప్పినా.. తన తరఫున బహుమతిగా తీసుకోవాలని సదరు అభిమాని కోరటంతో వారు కాదనలేకపోయారు.

ఇక్కడవరకు సీన్ బాగానే ఉన్నా.. ఐదుగురు క్రికెటర్లను నేరుగా కలవటం.. వారి తిన్న రెస్టారెరంట్ బిల్లును తాను కట్టిన హాట్ విషయాన్ని సదరు వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. దీంతో రచ్చ మొదలైంది. బయో బబూల్ నిబంధనల్ని ఉల్లంఘించి ఎలా బయటకు వస్తారు? అన్న ప్రశ్నతో పాటు.. తన పోస్టులో సదరు క్రికెటర్లను తాను హగ్ చేసుకున్నట్లుగా అభిమాని పేర్కొన్నారు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం హగ్ చేసుకోకూడదు. దీంతో.. క్రికెటర్లను ఐసోలేషన్ కు తరలించారు.

దీంతో మరోసారి ఎంట్రీ ఇచ్చిన సదరు అభిమాని... తాను ఉత్సాహంలో మాట జారానని.. తనను పంత్ ను హగ్ చేసుకోలేదని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ పట్టించుకోని అధికారులు రూల్స్ బ్రేక్ చేసిన క్రికెటర్లను ఐసోలేషన్ కు పంపారు. ఇక్కడితో ఈ ఇష్యూ ఆగలేదు. సదరు అభిమాని పోస్టు చేసిన బిల్లు ఇప్పుడు మరో రచ్చకు కారణమైంది. ఎందుకంటే.. ఆ బిల్లులోని క్రికెటర్లు ఆర్డర్ చేసిన వస్తువులన్ని నాన్ వెజ్ కావటం. మరి.. ముఖ్యంగా అందులో బీఫ్ ఉండటం.. రోహిత్ శర్మనే దాన్ని ఆర్డర్ చేసినట్లుగా ప్రచారం మొదలు కావటంతో ఈ ఇష్యూ మరింత సీరియస్ గా మారింది.

బిల్లులోని సమాచారం ప్రకారం చూస్తే.. రొయ్యలు.. పంది మాంసం.. ఆవు మాంసం.. స్టిర్ ఫ్రైడ్ బీఫ్.. బీన్ సాస్.. పుట్టగొడుగులు.. కోడి మాంసంతో తయారు చేసిన ఫ్రైడ్ రైస్.. డైట్ కోక్ ఉన్నాయి. మొత్తం బిల్లు మన రూపాయిల్లో రూ.6700. ఈ బిల్లు ఇప్పుడు రచ్చగా మారటమే కాదు.. రోహిత్ శర్మ బీఫ్ ఆర్డర్ చేశారన్న ప్రచారం ఊపందుకోవటంతో పాటు.. వైరల్ గా మారింది. దీనికి తోడు.. గతంలో రోహిత్ శర్మ వెజ్ టేరియన్ గా కలర్ ఇవ్వటం.. జంతుహింస మీద లెక్చర్ ఇవ్వటాన్ని గుర్తు చేస్తూ తప్పు పడుతున్నారు.

ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టులకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ.. మూడో టెస్టుకు రెఢీ అవుతున్న వేళ.. ఈ వివాదంలోకి కూరుకుపోవటం.. తాజాగా బీఫ్ వివాదం అతడ్ని మరింత ఇబ్బందుల్లో పడేసేలా చేసిందంటున్నారు. తాజాగా తెర మీదకు వచ్చిన సందేహాలు అతడి ఆత్మవిశ్వాసంతో పాటు.. ఆట మీద ప్రభావాన్ని చూపే అవకాశం ఉందంటున్నారు. రానున్న రోజుల్లో అభిమాని బిల్లు చెల్లింపు మరెన్ని సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి.