Begin typing your search above and press return to search.

బీ అల‌ర్ట్‌: జోడో యాత్ర.. `జోక్‌`గా మారుతోందా?

By:  Tupaki Desk   |   30 Oct 2022 4:30 PM GMT
బీ అల‌ర్ట్‌: జోడో యాత్ర.. `జోక్‌`గా మారుతోందా?
X
కాంగ్రెస్‌కు ఇప్పుడు విష‌మ ప‌రీక్ష‌. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హ‌వా ఇంకా దేశంలో కొన‌సాగుతూనే ఉంద‌ని. ఎక్క‌డా త‌గ్గుముఖం కూడా ప‌ట్ట‌డం లేద‌ని ఇటీ వ‌లే ఒక స‌ర్వే స్ప‌ష్టం చేసింది. అంటే.. ఇంతింతై.. అన్న‌ట్టుగా మోడీ ప్ర‌భ పెరుగుతోందే త‌ప్ప త‌ర‌గ‌డం లేదు. ఈ విష‌యం కాంగ్రెస్‌కు కూడా ఎక్కువ గానే తెలుసు. దీనిని ఎదుర్కొనేందుకే కాంగ్రెస్ యువ నాయ‌కుడు, ఎంపీ రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టారు. దీనికి సంబంధించి ఆయ‌న ఎన్ని చెప్పినా (అంటే ఆర్ ఎస్ ఎస్, బీజేపీ విధానాల‌తో దేశం ముక్క‌ల‌వుతోంద‌ని దీనిని ఏకం చేసేందుకే తాను యాత్ర చేప‌ట్టాన‌ని) వెనుక ఉన్న రీజ‌న్ వేరు.

అదే మోడీ హ‌వాను నియంత్రించి రాహుల్ హ‌వా, కాంగ్రెస్ ప‌వ‌నాలు జోరుగా వీచేలా చేయ‌డం. అందుకే ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు గాంధీల కుటుంబం ఊహ‌కు కూడా అంద‌ని విధంగా దేశ స్వాతంత్య్ర చ‌రిత్ర‌లో ఒక జాతీయ పార్టీ నాయ‌కుడు 3726 కిలో మీట‌ర్ల మేర ఆసేతు హిమాచ‌లం న‌డిచి.. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునేలా ప్లాన్ చేశారు. రాహుల్ ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం ఈ యాత్ర కీల‌క ల‌క్ష్యం. ఆయ‌న‌ను ప్ర‌ధానిగా ఆమోదించ‌డం కూడా ఈ యాత్ర‌ల‌క్ష్యాల్లో అత్యంత కీల‌క‌మైన పాయింట్. దీనిని పైకి చెప్ప‌క‌పోయినా అంత‌ర్లీనంగా దండ‌లో దారంగా ఉన్న అంశం ఇదే.

మ‌రి ఆ రేంజ్‌కు ఈ యాత్ర చేరుతోందా? లేక ఏం జ‌రుగుతోంది. అనేది చ‌ర్చ‌కు దారితీస్తున్న విష‌యం. ఎందుకంటే ఆదిలో కేర‌ళ‌లో ఈ పాద‌యా త్ర‌ను ప్రారంభించిన‌ప్పుడు అంతో ఇంతో సీరియ‌స్ నెస్ క‌నిపించింది. దీంతో బీజేపీలోనూ ఒక అల‌జ‌డి ప్రారంభ‌మైంది. ఎందుకంటే ప్ర‌జ‌ల్లో సింప‌తీ ప్రోదిచేసుకుంటే త‌మ‌కు ఎక్క‌డ ఎఫెక్ట్ కొడుతుందో అని నాయ‌కులు త‌ల్ల‌డిల్లారు. వెంటనే టీష‌ర్ట్ ర‌గ‌డ‌ను తెర‌మీదికి తెచ్చారు. త‌ర్వాత ఈ యాత్ర‌ను డైవ‌ర్ట్ చేసేందుకు గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను త‌మ‌వైపు తిప్పుకొన్నారు. రాజ‌స్థాన్‌లోనూ బీజేపీ ప్ర‌మేయంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మ‌ధ్య కీచులాట‌లు తెర‌మీద‌కి వ‌చ్చాయి.

అయితే, క‌ర్ణాట‌క‌, ఏపీల్లోకి ఈ పాద‌యాత్ర అడుగు పెట్టిన త‌ర్వాత బీజేపీ ఫోక‌స్ త‌గ్గిపోయింది. అంటే..ఇక్క‌డ జోడో యాత్ర పుంజుకుంద‌ని కాదు. వారు జోడోయాత్ర ప్ర‌భావం చూప‌డం లేద‌ని ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. ఇది కూడా నిజ‌మే. యాత్ర‌లో సీరియ‌స్ నెస్ లేకుండా పోయింది. రాహుల్ చేస్తున్న చిలిపి ప‌నులు.. ఎక్క‌డా ప్ర‌జ‌ల‌ను సీరియ‌స్‌గా క‌లుసుకోక పోవ‌డం, వారి బాధ‌లు వినేందుకు ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డం వంటివి స‌హ‌జంగానే జోడో యాత్ర సీవియార్టీపై ప్ర‌భావం చూపింది.

ఇక‌, ఇప్పుడు జోడో యాత్ర‌లో ప‌రుగు పందేలు.. డ్యాన్సులు.. వంటివి కూడా జాతీయ నేత‌ను లోక‌ల్ నేత‌గా మార్చేస్తున్నాయ‌నే వాద‌న వినిపిస్తోంది. పైగా .. ఎంచుకున్న రూట్ కూడా జాతీయ ర‌హ‌దారులు కావ‌డంతో పెద్ద‌గా జ‌నాలు రావ‌డం లేదు. ఏదో పోగేసి తీసుకువ‌స్తున్న వారే త‌ప్ప‌. ఇది ఇప్పుడే క‌ట్ట‌డి చేసుకోక‌పోతే.. కాంగ్రెస్ నేత‌లు అలెర్టుగా లేక‌పోతే జోడో యాత్ర జోక్ యాత్ర‌గా మారిపోతుంద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.