Begin typing your search above and press return to search.

ప్రశాంత్ కిశోర్ లాజిక్ మిస్ అయ్యాడా...?

By:  Tupaki Desk   |   26 April 2023 6:00 PM GMT
ప్రశాంత్ కిశోర్ లాజిక్ మిస్ అయ్యాడా...?
X
ఎన్నికల వ్యూహకర్త అంటూ దానికి ఒక కార్పోరేట్ స్టైల్ ఇచ్చి రాజకీయాన్ని మొత్తం ట్రెడిషనల్ రూట్ నుంచి తప్పించిన వ్యక్తిగా ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే మీద విమర్శలు ఎపుడూ ఉంటాయి. రాజకీయాల్లో ధన ప్రవాహం ఒక వైపు పెరిగింది అని అంతా తొంబై దశకం దాకా చర్చించుకుంటూ ఆందోళన చెందుతున్న వేళ కొత్త మిలీనియంలో ఆ ఖర్చుకు ఇబ్బడి ముబ్బడిగా పెరిగే మరో ఖర్చుగా ఎన్నికల వ్యూహాలు అంటూ పీకే లాంటి వారు అవతరించి టోటల్ భారతీయ రాజకీయ గమనాన్ని అవాంచనీయమైన మార్గం దిశగా మళ్ళించారు అని అంటారు.

పీకే ఎపుడూ కూడా గెలుపు గుర్రాలను ఎంచుకుని వారి వైపు ఉంటూ తానే వారిని గెలిపించాను అని చెప్పుకుంటారని ఆరోపణలు ఉన్నాయి. ఏటికి ఎదురీదడం ఆయనకు కుదరని పని. అలాగే ఓటమి అంచుల్లో ఉన్న వారిని గెలిపించిన చరిత్ర కూడా లేదు. జనంలో మోజు క్రేజు ఉన్న వారిని ఎంచుకుని ఆ మీదట పాలిటిక్స్ ని కార్పోరేట్ స్టైల్ లో మిక్స్ చేసి జనాలకు ఒక రకమైన భ్రాంతిని కలిగించడం ద్వారా ఫలితం తన వైపు వచ్చేలా చూసుకోవడంలోనే పీకే సిద్ధహస్తుడు అని విమర్శలు ఉన్నాయి.

ఇంత జాగ్రత్తగా పాలిటిక్స్ లో సలహాలు వ్యూహాలు కూడా అమ్మబడును అంటూ కొత్త వ్యాపారాన్ని దేశానికి పరిచయం చేసిన పీకే కూడా అపజయాలు ఎన్నో ఎదుర్కొన్నారు. అంత వరకూ ఎందుకు ఆయన అందరినీ నేనే గెలిపించాను అనుకుని తాను తన సొంత రాష్ట్రం బీహార్ లో మాత్రం ఏ మాత్రం ప్రకాశించ లేకపోతున్నారు అంటేనే అర్ధం చేసుకోవాల్సింది బోలెడు ఉంది అని అంటున్నారు. పీకే పొలిటికల్ గ్లామర్ ఉంటేనే తన సలహాలతో స్ట్రాటజీలతో ముందుకు తీసుకెళ్ళగలరు తప్ప ఏమీ లేని వారిని ఎత్తుకు ఎక్కించలేరని ఆయన స్వీయ అనుభవాలే చెబుతున్నాయి.

ఇక పీకే అంటే తెర చాటు వ్యూహకర్త అనే అంటారు. ఆయన తెర ముందు రాజకీయ హీరో అవుదామని అనుకుంటున్నారు. ఆయనకు ఉన్న రిఫరెన్స్ పార్టీల గోడలను దాటి బయటకు వెళ్లలేనిది. జనాలకు చేరనిది. అందుకే ఆయన బీహార్ లో పాదయాత్ర చేసినా శ్రమ పడుతున్నా జనాల నుంచి ఆయనకు అనుకున్న ఆదరణ లభించడం లేదు అని అంటున్నారు. అయితే దీంతో పీకేలో ఆక్రోశం పుట్టుకొచ్చిందో లేక ఉక్రోషం తన్నుకు వచ్చిందో తెలియదు కానీ మొత్తానికి ఆయన వారసత్వ రాజకీయాల మీద తనదైన విమర్శలు చేస్తున్నారు.

అయితే ఆయన జనరలైజ్ చేసి అనడంలేదు. కేవలం బీహార్ కే పరిమితం అయి కొన్ని హాట్ కామెంట్స్ చేశారు కానీ రాజకీయాల్లో ఈ కామెంట్స్ అందరికీ వర్తిస్తాయి కాబట్టి పీకే అన్న దాంట్లో ఏముంది అన్నది చూడాలని అంటున్నారు. లాలూ ప్రసాద్ కొడుకు కాకపోతే తేజస్వీ యాదవ్ ని బీహార్ లో ఎవరూ పట్టించుకోరు అని పీకే ఒక పవర్ ఫుల్ డైలాగ్ వదిలారు. అంటే తండ్రి నుంచి పార్టీని తీసుకుని బీహార్ లో మూడు పదుల వయసులోనే తేజస్వి యాదవ్ రాజకీయంగా ముందుకు వెళ్తున్నారు, దూసుకుపోతున్నారు అని పీకే భావన ఆరోపణ కాబోలు.

అదే నిజం అనుకుంటే తాను ఎన్నికల వ్యూహ రచన కోసం ఒప్పందం చేసుకున్న పార్టీల నేతలు కూడా రాజకీయ వారసులే కదా అన్నది పీకే ఎందుకు గురించడంలేదు అని అంటున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ని తీసుకుంటే ఆయన వైఎస్సార్ కుమారుడు కాకపోతే జనాదరణ ఇంతలా లభించేదా అన్నది కూడా పాయింట్ కదా అని అంటున్నారు. అలాగే తెలంగాణాలో బీయారెస్ తో కూడా పీకే టీం ఎన్నికల స్ట్రాటజీ అందిస్తూ ఉంది.

కేటీయార్ సైతం కేసీయార్ కుమారుడు కాకపోయి ఉంటే ఆయన రాజకీయంగా వెలిగేవారా అన్న ప్రశ్న పీకేని అడిగితే ఏమి బదులిస్తారు అని అంటున్నారు. ఇంత చిన్న లాజిక్ ని పీకే ఎలా మిస్ అయ్యారు అని అంటున్నారు. ఆయన ఇలాంటివి అన్నీ ఇన్నాళ్ళూ మరచిపోయే ఎన్నికల వ్యూహకర్తగా ఆయా పార్టీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారా ఇపుడు తనదాకా వస్తే మాత్రం కేవలం బీహార్ లో మాత్రమే తేజస్వి యాదవ్ ఆయన వారసుడిగా కనిపిస్తున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

ఇక రెండేళ్ల క్రితం తమిళనాడులో స్టాలిన్ తో కూడా పేకీ టీం ఎన్నికల వ్యూహాల కోసం ఒప్పందాలు కుదుర్చుకుందని అంటారు. మరి స్టాలిన్ ఎవరు,ఆయన కరుణా నిధి కుమారుడు కాదా అని ప్రశ్నిస్తున్నారు. పీకేకి అర్జంటుగా బీహార్ లో బడా నేతగా కావాలని ఉంది. కానీ లాలూ కాలం నుంచి పటిష్టంగా ఉన్న ఆర్జేడీ ఉంది. దాన్ని ఇపుడు తేజస్వి యాదవ్ సమర్ధంగా లీడ్ చేస్తున్నారు. దాంతోనే ఆయన ఈ రాజకీయ వారసత్వం మీద విమర్శలు చేస్తున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా పీకే లాజిక్ అయితే మిస్ అయ్యారనే అంతా అంటున్నారు.