Begin typing your search above and press return to search.

బీజేపీ గేమ్ ప్లాన్ ను పవన్ అర్థం చేసుకున్నారా?

By:  Tupaki Desk   |   4 Jun 2022 3:25 AM GMT
బీజేపీ గేమ్ ప్లాన్ ను పవన్ అర్థం చేసుకున్నారా?
X
రాజకీయ అధినేతలు సాధారణంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతుంటారు. ఆ మాటకు వస్తే.. ఆ తీరుతో చాలానే విషయాల్ని అర్థం చేసుకునే వీలు ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తగ్గించారు కానీ.. వాస్తవానికి ఉద్యమ కాలంలో తరచూ ఆయన మీడియా ప్రతినిధులతో సుదీర్ఘ భేటీని నిర్వహిస్తూ ఉండేవారన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ఇక.. వైసీపీ అధినేత జగన్ కు మొదట్నించి మీడియా భేటీల్ని నిర్వహించే విషయంలో పెద్ద ఆసక్తిని ప్రదర్శించరు. తన దగ్గరే వందలాది మంది ఉద్యోగుల రూపంలో మీడియా ప్రతినిధులు ఉన్న నేపథ్యంలో కొత్తగా తాను తెలుసుకునేది ఏముందన్నట్లుగా ఆయన తీరు ఉంటుందని చెబుతారు.

మీడియా విషయంలో చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సినీ రంగంలో ఉన్నప్పుడు సినిమా రిపోర్టర్లను దగ్గరకు రానిచ్చే విషయంలో పవన్ కల్యాణ్ కు చాలానే రిజర్వేషన్లు ఉండేవని చెబుతారు. ఆయన్ను కలవటం చాలా కష్టమనే మాట అప్పట్లో నడిచేది. జనసేన పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత.. ఆయనలో మార్పు కొంత వస్తే.. ఇటీవల కాలంలో చాలానే మార్పు కనిపిస్తోందని చెబుతున్నారు. మీడియాతో ఆయన మాట్లాడే ధోరణిలోనూ మార్పు వచ్చిందని చెబుతున్నారు.

వివరాల్ని తెలుసుకోవటం.. తాను చెప్పాల్సిన సమాచారాన్ని పద్దతి ప్రకారం చెబుతున్నారు. తాజాగా మంగళగిరిలో మీడియా ప్రతినిధులతో భేటీ అయ్యారు పవన్ కల్యాణ్. ఆ సందర్భంగా ఆయన నోటి నుంచి రెండు మూడు అంశాలపై ఆయన స్పష్టమైన వైఖరిని వెల్లడించటం గమనార్హం.

ఇటీవల కాలంలో బీజేపీ - జనసేన ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ ఉంటారన్న ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ ను ట్రాప్ లో పడేసే ఎత్తుగడలో భాగంగానే బీజేపీ నేతలు పలుమార్లు తమ ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్ అంటూ వ్యాఖ్యానించటం తెలిసిందే.

ఇదంతా చూసినప్పుడు ఈ వ్యాఖ్యలపై పవన్ స్పందన ఏమిటన్న సందేహం రాక మానదు. తాజాగా ఆయన ఆ విషయానికి క్లారిటీ ఇచ్చేశారు. ‘‘నేను గాల్లో మేడలు కట్టను. ఇదంతా ప్రచారమే’’ అని తేల్చేశారు. పవన్ తాజా వ్యాఖ్యల తర్వాత బీజేపీ.. జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థి అన్న ప్రపోజల్ కు తాను సిద్ధంగా లేదని చెప్పటం ద్వారా.. టీడీపీ అధినాయకత్వానికి ఊపిరి పీల్చుకునే అవకాశాన్ని ఇచ్చారని చెప్పాలి. నిజానికి బీజేపీ అధినాయకత్వం ఒక క్రమపద్దతిలో పవన్ ను ఒక ట్రాప్ లో చిక్కుకునేలా ఎత్తుగడ వేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఉమ్మడి సీఎం అభ్యర్థి అన్న ప్రచారం బలం పెరిగితే.. దాని నుంచి బయటకు రాలేని పరిస్థితిని తీసుకొస్తే.. టీడీపీ ఆయనతో జత కట్టలేని పరిస్థితికి తీసుకొస్తున్నరన్న వాదన వినిపించింది.

ఇలాంటి పరిస్థితుల్లో తాను వాస్తవ దూరమైన అంశాల్ని పట్టించుకోనన్న క్లారిటీ ఇవ్వటంతో పాటు.. బీజేపీతో కలిసి వెళ్లాలన్న రూల్ ఏమీ తనకు లేదన్న విషయాన్ని స్పష్టం చేశారు. ‘కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత’ అన్న మాట పవన్ నోటి నుంచి రావటం చూస్తే.. బీజేపీతో పొత్తు అంశంపై ముందస్తుగా తానేమీ కమిట్ కాలేదన్న విషయాన్ని స్పష్టం చేశారని చెప్పాలి. మొత్తానికి ఉమ్మడి సీఎం అభ్యర్థి ప్రచారాన్ని కొట్టిపారేయటం ద్వారా.. బీజేపీ ట్రాప్ లో పవన్ పడలేదన్న మాట వినిపిస్తోంది.