Begin typing your search above and press return to search.

ఆడవాళ్ల గురించి పవన్ అసభ్యంగా మాట్లాడారా? గురివిందలుగా వైసీపీ నేతలు

By:  Tupaki Desk   |   13 Jan 2023 12:00 PM IST
ఆడవాళ్ల గురించి పవన్ అసభ్యంగా మాట్లాడారా? గురివిందలుగా వైసీపీ నేతలు
X
మేం ఏమైనా అనేస్తాం. ఎంత మాట అయినా అనేస్తాం. మా నోరు.. మా ఇష్టం. అందునా మా చేతిలో అధికారం ఉంది. పాలకులుగా అత్యున్నత స్థానాల్లో ఉంటున్నాం. కాబట్టి.. మా బుర్రకు వచ్చిన ప్రతి మాట అనేస్తాం. భరించండి అంటే భరిస్తారా? ఇవాల్టి రోజున చిన్న పిల్లాడు సైతం పంచ్ లు వేస్తున్నాడు. ఏదైనా మాట అంటే ఇట్టే కౌంటర్ ఇస్తున్నాడు. అలాంటిది ఒక పార్టీ అధినేతగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్ ను నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నప్పుడు.. మర్యాద అన్నది మర్చిపోయి సమయం.. సందర్భం లేకుండా టార్గెట్ చేయటమే పనిగా పెట్టుకొని అవాకులు చవాకులు పేలే వారికి సరైన కౌంటర్ ఇవ్వటం కూడా తప్పే అవుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఏపీ మంత్రి ఆర్కే రోజాను ఉద్దేశించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఒక్కసారిగా గొంతులు సవరించుకుంటున్నారు. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఆడవాళ్ల గురించి అసభ్యంగా మాట్లాడతావా? అంటూ పవన్ ను ఉద్దేశించి సంధించిన ప్రశ్నలోనే ఆయన తన మర్యాదను మిస్ అయ్యారని చెప్పాలి. ఎదుటోడు తప్పుడోడు అయినా.. మనం మన సంస్కారాన్ని మర్చిపోకూడదన్న చిన్న విషయాన్ని పేర్నినాని తరచూ మిస్ అవుతుంటారు. తాజాగా మరోసారి ఆయన అలానే వ్యవహరించారని చెప్పాలి.

'సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చులకనా? మీ ఇంట్లో ఆడవాళ్లు సినిమాల్లో నటించలేదా? ముందు మహిళలకు మర్యాద ఇవ్వటం నేర్చుకో' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పేర్ని నాని.. తాను మాట్లాడే మాటలకు ఏ మాత్రం లాజిక్ లేదన్న విషయాన్ని గుర్తించరా? అన్నది సందేహంగా మారుతుంది. సీనియర్ పొలిటీషియన్ గా పేరున్న ఆయనకు.. తాను మాట్లాడే మాటల్లో అంతో ఇంతో విషయం ఉండాలని కూడా పట్టించుకోకుండా నోటికి వచ్చినట్లుగా పవన్ ను మాట్లాడేయటం ద్వారా తాను మరింత పలుచన అవుతున్నానన్న విషయాన్ని మర్చిపోవటం గమనార్హం.

రణస్థలంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ మంత్రి ఆర్కే రోజాను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. దీనికి ముందు.. ఆమె పవన్ గురించి.. పవన్ కుటుంబం గురించి.. పవన్ సోదరుడు చిరంజీవి గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడిన తర్వాతే పవన్ రియాక్టు అయ్యారన్న విషయాన్ని మర్చిపోకూడదు. పేర్ని నాని లాజిక్కే తీసుకుంటే.. ఆడవాళ్ల గురించి పవన్ అంత చులకనగా మాట్లాడతారా? అన్న ప్రశ్నను సంధించినప్పుడు.. మరి.. మగాడి గురించి ఆర్కే రోజా అన్నేసి మాట్లాడటం సంస్కారమేనా? అన్న ప్రశ్నను కూడా అడగాల్సి ఉంటుంది కదా?

సినిమాల్లో నటించే ఆడాళ్లంటే చులకన అంటూ వైసీపీ నేతలు వేస్తున్న ప్రశ్నల్లో డొల్లతనం ఇట్టే కనిపించక మానదు. ఎందుకంటే.. ఆర్కే రోజా సంస్కారంగా మాట్లాడి ఉంటే.. ఇవాల్టిరోజున మాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదు. నిజానికి ఆర్కే రోజా ఎప్పటి నుంచో పవన్ కల్యాణ్ ను.. ఆయన కుటుంబాన్ని అదే పనిగా టార్గెట్ చేయటం తెలిసిందే. ఇంతకాలం ఓపిక పట్టినా కూడా ఆమె తీరు మారలేదు.

దీంతో..ఆమెకు అర్థమయ్యే భాషలో సమాధానం ఇచ్చినంతనే వైసీపీ నేతలు గుండెలు బాదేసుకోవటం చూస్తే.. పవన్ ఇంట్లోని మహిళల గురించి.. పవన్ వ్యక్తిత్వం గురించి మాట్లాడినప్పుడు ఈ మగమహారాజులంతా ఏమైపోయారు? అన్నది ప్రశ్న. ఇలాంటి వాటికి ముందు సమాధానాలు చెప్పిన తర్వాత.. పవన్ ఆడాళ్లను చులకనగా మాట్లాడుతున్నారంటూ మాట్లాడటంలో అర్థం లేదన్నది మర్చిపోకూడదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.