Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్‌కు తిరుగులేదా? ఏం చెప్ప‌ద‌లుచుకున్నారు?

By:  Tupaki Desk   |   3 July 2021 12:30 PM GMT
తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్‌కు తిరుగులేదా?  ఏం చెప్ప‌ద‌లుచుకున్నారు?
X
కేసీఆర్‌. ఇప్పుడు మ‌రోసారి జాతీయ స్థాయిలో మార్మోగుతున్న పేరు. ఒక‌ప్పుడు తెలంగాణ ఉద్య‌మ స‌మ యంలో జాతీయ ప‌త్రిక‌ల్లో క‌నిపించిన కేసీఆర్ వార్త‌లు.. ఇప్పుడు మ‌రోసారి.. క‌నిపిస్తున్నాయి. దీనికి ఆనాడు .. ప్ర‌జ‌ల ఆకాంక్ష కోసం ఉద్య‌మించిన నేప‌థ్యం అయితే.. ఇప్పుడు `ధిక్కార‌` స్వ‌రంతో చెల‌రేగుతున్న వైనంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కృష్టా రివ‌ర్ బోర్డు ఆదేశాల‌ను తోసిరాజ‌ని, నీటికేటాయిం పుల‌ను సైతం ప‌క్క‌న పెట్టి.. 100 శాతం విద్యుత్ ఉత్ప‌త్తి సాధించాల‌ని ఆదేశించ‌డం చూస్తే.. కేసీఆర్ చాలా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని అంటున్నారు.

ఏకంగా సాగునీటి ప్రాజెక్టుల వ‌ద్ద భారీ ఎత్తున బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. నిజానికి ఈ దేశంలో ఒక నీటి ప్రాజెక్టు వ‌ద్ద‌.. ఈ రేంజ్‌లో బ‌ల‌గాల‌ను మోహ‌రించ‌డం.. అనేది ఇదే తొలిసారి అని జాతీయ స్థాయి నీటి పారుద‌ల రంగం నిపుణులు సైతం చెబుతున్నారు. ఇంత‌గా.. కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును గ‌మ‌నిస్తున్న వారు.. కేసీఆర్‌.. త‌న‌ను తాను మోనార్క్‌గా భావిస్తున్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ త‌న‌క‌న్నా ప‌రిణితి ఉన్న నాయ‌కుడు కానీ, త‌న లాంటి వ్యూహ‌క‌ర్త‌కానీ, త‌న‌లాంటి ప్ర‌జా ఇమేజ్ ఉన్న నేత‌కానీ.. లేర‌ని.. ఆయ‌న నిశ్చితాభిప్రాయంతో ఉన్నారా? అనే అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

ఇప్పుడున్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. కేసీఆర్ మాదిరిగా.. నోరు విప్ప‌గ‌లిగే.. ధైర్యం.. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎవ‌రికీ క‌నిపించ‌డం లేదు. కేంద్రంపై పోరాడాల‌న్నా.. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాల‌పై దూకుడుగా వెళ్లాల‌న్నా.. కేసీఆర్ త‌న‌కు తానే సాటి అనుకుంటున్నారు. కేంద్రంలోని మోడీ స‌ర్కారును.. ఇప్పుడున్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య‌నేత‌లు ఎవ‌రూ విమ‌ర్శించ‌డం లేదు. ఒక్క కేసీఆర్ త‌ప్ప‌. అదేస‌మ‌యంలో త‌న‌పై ఎలాంటి కేసులు లేక‌పోవ‌డం.. కేంద్రంలోనూ సానుకూల రాజ‌కీయాలు చేయ‌గ‌ల నేర్పు ఉండ‌డం.. వంటివి గ‌మ‌నిస్తే.. కేసీఆర్‌.. త‌న దూకుడును ఎందుకు పెంచుతున్నార‌నే విష‌యం అర్ధ‌మవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

కేంద్రంలో థ‌ర్డ్ ఫ్రంట్ అనేది.. త‌ర‌చుగా తెర‌మీదికి వ‌స్తున్న విష‌యం. ఈ క్ర‌మంలో దీనికి లీడ‌ర్ ఎవ‌రు? అనే ప్ర‌శ్న కూడా ఎప్పుడూ చ‌ర్చ‌నీయాంశంగానే ఉంది. గ‌తంలో కొంత ప్ర‌య‌త్నం చేసిన కేసీఆర్‌.. రెండు మూడు రాష్ట్రాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేశారు. అయితే.. ఎందుకో బ్రేకులు ప‌డ్డాయి. అయితే.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మూడేళ్ల స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో త్వ‌ర‌లోనేఆయ‌న మ‌ళ్లీ మూడో ఫ్రంట్ ముచ్చ‌ట‌కు తెర‌దీసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో తెలుగు రాష్ట్రాల్లో త‌న‌ను మించిన నాయ‌కుడు లేడ‌నే సంకేతాల‌ను పంపేందుకు.. కేసీఆర్‌.. ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే చ‌ర్చ కూడా పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో జ‌రుగుతోంది. దీంతో కేంద్రంలో చ‌క్రంతిప్పాల‌నుకునే ప్రాంతీయ పార్టీల‌కు కేసీఆర్ చుక్కాని అవుతార‌ని.. ఫ‌లితంగా ఆయ‌న `క‌ల‌` నెర‌వేర్చుకునేందుకే ఈ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని అంటున్నారు.