Begin typing your search above and press return to search.

ఆ ఫ్రెంచ్ వీరబ్రహ్మం మోడీ గురించి చెప్పారా?

By:  Tupaki Desk   |   18 March 2016 4:24 PM GMT
ఆ ఫ్రెంచ్ వీరబ్రహ్మం మోడీ గురించి చెప్పారా?
X
తెలుగోళ్లకు విరాట్ పోతులూరు వీరబ్రహ్మంగారు పేరు విన్న వెంటనే ఆయన చెప్పిన భవిష్యత్ సంగతులు చప్పున గుర్తుకు వస్తాయి. మన తెలుగోళ్లకు వీరబ్రహ్మంగారు ఉంటే... ఫ్రెంచ్ ప్రజలకు అలాంటి పెద్దమనిషే ఒకరున్నారు. ఆయనపేరు నాస్ట్రాడామస్. 1555లో ఆయన చెప్పిన చాలామాటలు ఇప్పటికే నిజం కావటం.. ఆయన భవిష్య వాణి మీద ప్రపంచ వ్యాప్తంగా గురి ఎక్కువ.

అలాంటి ఆయన భారత ప్రధాని మోడీ గురించి చెప్పుకొచ్చారా? అంటే అవునని చెబుతున్నారు కేంద్రమంత్రి కిరణ్ రిజీజు. తాజాగా ఆయన తన ఫేస్ బుక్ అకౌంట్ లో ఒక ఆసక్తిరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఫ్రెంచ్ వీరబ్రహ్మంగా చెప్పుకునే నాస్ట్రాడామస్ చెప్పిన భవిష్యవాణిలో నరేంద్రమోడీ ప్రస్తావన ఉందని.. ఆయన చెప్పిన దాని ప్రకారం.. భారతదేశాన్ని 2014 నుంచి 2026వరకు సమర్థుడైన ఒక నాయకుడు పరిపాలిస్తాడని చెప్పినట్లుగా వెల్లడించారు.

తొలుత ఆ నాయకుడ్నిప్రజలు ద్వేషిస్తారని.. కానీ తర్వాతి కాలంలో ఆయన్ను ఎంతగానో ప్రేమిస్తారని చెప్పినట్లుగా పేర్కొన్న కేంద్రమంత్రి.. ఆ సమర్థుడైన నాయకుడు దేశానికే కాదు.. ప్రపంచానికే బంగారు భవిష్యత్తును తీసుకొస్తాడని చెప్పినట్లుగా వెల్లడించారు. అనేక దేశాలు భారత్ కింద తలదాచుకుంటాయని ఆయన చెప్పుకొచ్చారు. అయితే.. ఆయనీ వాదన అంతా ఎలా చెబుతున్నారు? దానికి ఆధారం ఏమిటన్న విషయాన్ని పెద్దగా ప్రస్తావించని కేంద్ర మంత్రి ఇంకో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

లోక్ సభలో బలాబలాల గురించి కిరణ్ చెప్పిన ఒక లెక్క ఆశ్చర్యకరంగా ఉండటం గమనార్హం. అదేమంటే.. లోక్ సభలో బీజేపీకి వచ్చిన సీట్లు 283 (2+8+3) కలిపితే వచ్చేది 13. అదే రీతిలో ఎన్డీయేకి వచ్చిన మొత్తం సీట్లు 337. అంతేకాదు.. యూపీఏకు వచ్చిన మొత్తం సీట్లు 58.. అంతేనా.. మిగిలిన అన్నీ పార్టీలకు వచ్చిన సీట్లు మొత్తం 148. వీటన్నింటిని వేటికవే కలిపితే.. మొత్తం వచ్చే ఫలితం ‘‘13’’ కావటం గమనార్హం. నిజంగానే.. ఈ లెక్క కాస్తంత విస్మయకరంగా ఉంది కదూ.