Begin typing your search above and press return to search.

జగన్ కి ముద్రగడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా...?

By:  Tupaki Desk   |   21 Jun 2023 6:00 PM GMT
జగన్ కి ముద్రగడ గ్రీన్ సిగ్నల్  ఇచ్చేశారా...?
X
ఏపీ రాజకీయాల్లో ఇపుడు ముద్రగడ హాట్ టాపిక్ గా మారారు. నిజానికి ఆయన గత పదేళ్ళుగా క్రియాశీల రాజకీయాల కు దూరంగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో మళ్లీ రీ యాక్టివ్ అవుతారు అని అంతా అంటున్నారు. దానికి తగినట్లుగానే వైసీపీ నేతలు ఆయన్ని తరచూ కలుస్తున్నారు. ఈ నేపధ్యంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కి మద్దతుగా ముద్రగడ పద్మనాభం రంగం లోకి దిగడం, పవన్ రాజకీయ విధానాల మీదనే తూర్పారా పడుతూ లేఖాస్త్రాన్ని సంధించడంలో ఏపీ లో ముద్రగడ వర్సెస్ జనసేన అన్నట్లుగా సీన్ తయారైంది.

అయితే జనసేన ఈ విషయం లో నేరుగా ఎంట్రీ ఇవ్వడంలేదు. తెలివిగానే వ్యవహరిస్తోంది. కాపు సంక్షేమ సేన అంటూ హరి రామజోగయ్య స్థాపించిన సంస్థ నుంచే ముద్రగడ కు కౌంటర్లు వరసగా వచ్చి పడుతున్నారు. నిన్న జోగయ్య ముద్రగడ మీద ఫైర్ అయితే నేడు కాపు సంక్షేమ సేన నుంచి క్రిష్ణాంజనేయులు ముద్రగడ రాజకీయాన్ని దుయ్యబెట్టారు.

జగన్ కి కాపు జాతి ని అమ్ముడుపోయేలా చేస్తున్నారు అని మండిపడ్డారు. పవన్ని వైసీపీ నేతలు అదే పనిగా విమర్శిస్తూటే ముద్రగడ ఎక్కడ ఉన్నారని ఆయన నిలదీస్తున్నారు. ద్వారంపూడి అనుచరులు కాపు మహిళల ను తిట్టి కొట్టి చేస్తే ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాపుల కు రిజర్వేషన్ ఇవ్వమని చెప్పిన జగన్ మంచి వారు అయ్యారా అని ఎకసెక్కమాడారు.

సరే ఇవన్నీ ముద్రగడ వంటి సీనియర్ ఊహించనివి కాదు. ఇపుడు ఆయన ఎటూ పవన్ కి ఎదురు నిలిచారు. జనసేన నుంచి కాపు సేన నుంచి వస్తున్న నిరసనల ను ఆయన ఎదుర్కొంటున్నారు. ఒక విధంగా తన లేఖ తో ఆయన రాజకీయ రీ ఎంట్రీ జరిగిపోయింది అని అంటున్నారు. ఎటూ వైసీపీ తోనే ముద్రగడ ను జట్టు కడుతున్నారు జనసేన నేతలు, కాపు సేన నేతలు.

మరి ముద్రగడ ఆ పని చేస్తారా. జగన్ తో కలసి పనిచేస్తారా. ఫ్యాన్ నీడకు చేరుతారా అన్న చర్చ అయితే వస్తోంది. ముద్రగడ కు ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు అంటే పడదు, అలాగే పవన్ రాజకీయ పోకడల ను కూడా ఆయన తాను రాసిన లేఖ లో గట్టిగానే విమర్శించారు. ఇపుడు చూస్తే వైసీపీయే ఏకైక ఆప్షంగా ఉంది.

రాజకీయాల్లో ఒకసారి వేలూ కాలూ పెడితే ఇక వెనక్కు తీసుకోవడం కష్టం. ముద్రగడ కోరి లేఖ రాసి రాజకీయాన్ని రగిలించారు. ఇపుడు ఆయన కచ్చితంగా ఒక పార్టీలో చేరి రాజకీయం చేయాల్సిందే అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఆయన లేఖ రాయడం వెనక ఉద్దేశ్యం అదే అయి ఉంటుందా అన్న చర్చ సాగుతోంది.

మొదటి నుంచి కాపులు ఎపుడూ ఏకమొత్తంగా లేరు అన్న విమర్శలు ఉన్నాయి. వారే కనుక సంఘటితంగా ఉంటే ఏనాడో కాపు సీఎం ఏపీ లో అయి ఉండేవారు అని అంటున్నారు. ఇపుడు ఎతూ కాపులు చీలిపోయారు. కాబట్టి తన వర్గాన్ని కాపాడుకునేందు కు తన రాజకీయ రీ ఎంట్రీని సక్సెస్ చేసుకునేందుకు ముద్రగడ వైసీపీ కండువా కప్పుకుంటారా అన్నదే చర్చగా ఉంది. మరి ముద్రగడ ఏమి చేస్తారో చూడాలి. ఏది ఏమైనా ముద్రగడ పవన్ కి యాంటీ అన్నది మాత్రం నిన్నటి లేఖ తో క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఆయన న్యూట్రల్ గా ఉన్నా వైసీపీకి లాభమే అని అంటున్నారు.