Begin typing your search above and press return to search.

షర్మిల ప్రచారం కారణంగా ఎంపీ రఘురామ గెలిచాడా?

By:  Tupaki Desk   |   28 Sep 2021 3:48 AM GMT
షర్మిల ప్రచారం కారణంగా ఎంపీ రఘురామ గెలిచాడా?
X
వైసీపీ నరసాపురం రెబల్ ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చరిష్మా కంటే తన సొంత బలంతోనే 2019 ఎన్నికల్లో తాన సీటు గెలిచినట్లు చెప్పారు. ఈ మాట వైఎస్ షర్మిలే నిన్న చెప్పిందన్నారు. తన సోదరుడితో విభేదిస్తూ తెలంగాణలో ప్రత్యేక ప్రాంతీయ పార్టీని స్థాపించిన జగన్ సోదరి వైఎస్ షర్మిల ప్రచారం చేసి పార్టీ కోసం కష్టపడిందని ఆమె వల్ల కూడా వైసీపీ పార్టీ విజయం సాధించిందని స్వయంగా ఆమె చెప్పిందని రఘురామ వివరించాడు. తన విజయానికి జగన్ చరిష్మా కారణం కాదని.. తనే కారణమని రఘురామ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

రఘురామరాజు న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్‌సి విజయంలో షర్మిల ప్రధాన పాత్ర పోషించారని కొనియాడారు. "ఆమె తన సోదరుడితో సమానంగా పాదయాత్ర చేపట్టింది. ఎన్నికల్లో పార్టీ కోసం ప్రచారం చేసింది. ఆమె ప్రయత్నాల వల్ల, పార్టీ అధికారంలోకి వచ్చింది” అని ఆయన అన్నారు.

షర్మిల నర్సాపురంలో విస్తృతంగా ప్రచారం చేశారని ఎంపీ రఘురామ గుర్తు చేశారు. "ఆమె నా నియోజకవర్గంలో నాలుగు ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించారు. భారీ సంఖ్యలో జనాన్ని ఆకర్షించారు. వాస్తవానికి నర్సాపురంలో వైఎస్ఆర్‌సి విజయం కోసం ఆమె జగన్ కంటే ఎక్కువ ప్రయత్నాలు చేసింది ” అని తిరుగుబాటు ఎంపీ అన్నారు.

"పార్టీ విజయం కోసం షర్మిల ప్రయత్నించినప్పటికీ పార్టీ సభ్యత్వం ఇవ్వకపోవడం దురదృష్టకరం. జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అయితే మరీ దారుణంగా వైఎస్ఆర్‌సిపికి షర్మిలకు ఎలాంటి సంబంధం లేదని ఎలా చెప్పగలరు? సజ్జల వ్యాఖ్యల పట్ల ఆమె మనస్తాపం చెందిందని అర్థమవుతోంది. ఆమె ఖచ్చితంగా కుటుంబంలో అన్యాయానికి గురైంది” అని రాఘురామరాజు అన్నారు. జగన్ , షర్మిల మధ్య ఖచ్చితంగా భారీ వివాదాలు ఉన్నాయని ఎంపీ రఘురామ తేల్చిచెప్పారు" వారి ఆస్తులు, కుటుంబ గొడవలు ఉన్నట్టున్నాయి.. వారు రెండు రాష్ట్రాలలో రాజకీయాలను విభజించినట్లు కనిపిస్తోంది" అని రఘురామ చెప్పుకొచ్చారు.

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిల తన సోదరుడికి ఎందుకు క్లీన్ చిట్ ఇవ్వలేదని ఎంపీ రఘురామ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. జగన్ జైలుకు వెళితే వారసులెవరు అని అడిగినప్పుడు.. జగన్ అస్సలు జైలుకు వెళ్లరని, సీబీఐ కేసులో బయటకు వస్తారని ఆమె చెప్పలేదని గుర్తు చేశారు. జగన్ భవిష్యత్తుపై ఆమెకు అనుమానం ఉందని ఇది చూపిస్తుంది” అని రఘురామరాజు చెప్పుకొచ్చారు.