Begin typing your search above and press return to search.

పెట్రోల్.. డీజిల్ ధరల్ని మోడీ మాష్టారు నిజంగానే తగ్గించారా?

By:  Tupaki Desk   |   4 Nov 2021 4:38 AM GMT
పెట్రోల్.. డీజిల్ ధరల్ని మోడీ మాష్టారు నిజంగానే తగ్గించారా?
X
అవును.. ఎట్టకేలకు మోడీ మాష్టారు విన్నారు. దేశంలోని కోట్లాది మందికి ఇబ్బందికరంగా మారిన పెట్రోల్.. డీజిల్ ధరా భారాన్ని ఆయన ఫీల్ అయ్యారు. అంతే.. రాత్రికి రాత్రి లీటరు పెట్రోల్ మీద రూ.5 ఎక్స్జైజ్ సుంకాన్ని.. లీటరు డీజిల్ మీద రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మాత్రం తగ్గింపు మోడీ సర్కారు నుంచి రావటంతో ఒక్కసారిగా ఆనందం వ్యక్తమైంది. ఇక.. బీజేపీ నేతలు అయితే అద్భుతాన్ని ప్రకటించినట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. దేశ ప్రజలకు మోడీ సర్కారు దీపావళి కానుక అందించినట్లుగా చెప్పుకోవటం కనిపిస్తోంది.

నిజంగానే దేశ ప్రజలకు మోడీ సర్కారు దీపావళి కానుకను ఇచ్చిందా? అన్నది ప్రశ్న. లెక్కల లోతుల్లోకి వెళ్లి.. ఉన్నది ఉన్నట్లుగా.. ఎలాంటి పక్షపాతం లేకుండా మాట్లాడితే.. తాజాగా తగ్గించిన ఎక్సైజ్ సుంకం ఏ మాత్రం ఊరటను ఇచ్చేది కాదు. మీలాంటి వాళ్లకు ఇలా తగ్గించటం కంటే.. పెంచుకుంటూ పోవటమే మంచిది. ఇచ్చిన తోఫాను అనుభవించే రాత మీకు లేదని కొందరు తిట్టొచ్చు. కానీ.. అంకెల్ని చూసినప్పుడు మోడీ సర్కారు చేసిందేమిటి? ప్రజలకు ఒరిగిందేమిటి? అన్నది చూస్తే అసలు విషయం అర్థమవుతుంది.

ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటివరకు చూస్తే.. లీటరు పెట్రోల్ మీద రూ.28 పెరిగితే.. డీజిల్ మీద రూ.26 పెరిగింది. అంటే.. గడిచిన పది నెలల్లో లీటరు పెట్రోల్.. డీజిల్ మీద పడిన భారం చూసినప్పుడు తాజాగా తగ్గించిన తగ్గింపు ఒక మూలకు రాదనే చెప్పాలి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినట్లుగా చేస్తున్న ప్రచారాన్ని చూస్తే నవ్వు ఆగదు. ఎందుకంటే.. 2014 మేలో ముడి చమురు బ్యారెల్ 105.71 డాలర్లు.

అప్పుడు లీటరు పెట్రోల్ ధర రూ.71.41 అయితే.. డీజిల్ ధర రూ.55.49. ఇప్పుడు ముడి చమురు బ్యారెల్ ధర రూ.82 డాలర్లు మాత్రమే. అలాంటప్పుడు తాజాగా తగ్గించిన ఎక్సైజ్ సుంకం పండుగ తోఫా అవుతుందా? అన్నది ప్రశ్న. అంతేకాదు.. యూపీఏ హయాంలో పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ రూ.9.48 ఉంటే.. డీజిల్ మీద రూ.3.56 ఉండేది. ఇప్పుడు తగ్గించటమే రూ.5.. రూ.10 అంటే.. వాయింపు ఎంత భారీగా ఉందన్న విషయం అర్థం కాక మానదు. ఇప్పుడు అర్థమైందా? మోడీ మాష్టారు ప్రకటించిన ఎక్సైజ్ సుంకం కోతలోని అసలు లెక్క?