Begin typing your search above and press return to search.

'గీత' దాటే సంప్రదాయం నరేంద్రమోడీతోనే మొదలైనట్లా?

By:  Tupaki Desk   |   22 July 2022 11:30 AM GMT
గీత దాటే సంప్రదాయం నరేంద్రమోడీతోనే మొదలైనట్లా?
X
మిగిలిన రంగాలతో పోలిస్తే రాజకీయ రంగం విభిన్నమైనది.. విలక్షణమైనది. 134 కోట్ల మంది భారతీయుల తలరాతల్ని మార్చే శక్తి.. రాత్రికి రాత్రి ప్రభావం చూపించే సత్తా ఒక్క రాజకీయాలకు మాత్రమే ఉందన్న విషయాన్ని మర్చిపోలేం. ప్రజాస్వామ్య భారతంలో మెజార్టీ ఏవైపు ఉంటే.. దాని వైపే మొగ్గు ఉంటుదన్నది నిజం కాదు. అది కూడా రాజకీయానికి సంబంధించి. ఇప్పటికే అందుకు సంబంధించిన ఎన్నో ఉదంతాల్ని చూశాం. ఇవన్ని పక్కన పెడితే.. రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు.. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి మధ్య అలిఖిత గీతలు కొన్ని గీసి ఉంటాయి. ఎవరెంత తోపు అయినప్పటికీ.. కంటికి కనిపించని ఆ గీతల్ని టచ్ చేయటానికి అస్సలు ఇష్టపడరు. అంతేనా.. వాటి జోలికి వెళ్లే సాహసం చేయరు.

అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోకుండా.. తిరుగులేని అధికారం చేతిలో ఉన్న వేళ.. కొందరు మాత్రం గీతలు చెరిపే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి తీరును ప్రదర్శించిన మొట్టమొదటి ప్రధానిగా ఇందిరాగాంధీని చెబుతారు. విపక్షాల్ని కంట్రోల్ చేయటం కోసం ఆమె అత్యయిక పరిస్థితిని విధించటానికి సైతం వెనుకాడలేదు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో మాయని మచ్చకు కారణమయ్యారు. ఇదంతా కూడా తనకు తిరుగులేదన్న అధికార అహంకారమే కారణంగా పలువురు చెబుతుంటారు. అప్పట్లో ఆమె ఎంత పవర్ ఫల్ అన్నది ఇప్పటి తరానికి తెలీదు. కానీ.. ఇప్పటి పరిస్థితుల్నే తీసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు అంతటి శక్తివంతమైన వ్యక్తిగా చెప్పక తప్పదు.

ఈ కారణంతోనే.. గతంలో కాంగ్రెస్ చేసిన తప్పుల్ని.. ఇప్పుడు బీజేపీ చేత చేయిస్తున్నారని చెప్పాలి. తమకు అధికారం అందని చోట.. సామ..బేధ.. దండోపాయాల్ని ఉపయోగించి ఆయన రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగిరేలా చేస్తున్నారు. దేశంలో ఇప్పటికే 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పటికీ.. మరిన్ని రాష్ట్రాల్లో తాము పాగా వేయాలని తపిస్తున్నారు. అధికార దాహాం..ధన దాహం ఎంతకూ తీర్చలేనిది.. తీరనిది. దాదాపుగా ఆ చట్రంలోకి వెళ్లినా.. అందులోకి ఇరుక్కోకూడదన్న విషయాన్ని మోడీ మర్చిపోయినట్లుగా విమర్శల్ని ఎదుర్కొంటున్నారు.

తిరుగులేని అధికారం చేతిలో ఉన్నప్పటికీ.. కొన్ని గీతల్ని దాటే ప్రయత్నం అస్సలు చేయకూడదు. తాజాగా నేషనల్ హెరాల్డ్ పత్రిక వ్యవహరాంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఈడీ ముందుకు తీసుకురావటంలో మోడీ సర్కారు సక్సెస్ అయ్యింది. అయితే.. ఇది ఇక్కడితో ఆగదన్న విషయాన్ని మోడీ మర్చిపోయినట్లున్నారు. గతంలో బీజేపీకి లోక్ సభలో రెండు అంటే రెండు సీట్లు మాత్రమే. అలాంటి పార్టీ ఇప్పటి పరిస్థితిని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కష్టకాలంలో ఉండి ఉండొచ్చు. అంత మాత్రానికి అవసరం లేని కేసుకు ఈడీ ముందుకు ఆ పార్టీ అధినేత్రిని తీసుకొచ్చేలా చేయటం కచ్ఛితంగా లక్ష్మణ రేఖను దాటినట్లే.

నిజంగానే సోనియాగాంధీకి ధన దాహం ఉండి ఉంటే.. ఆమె మీద ఇప్పటికే బోలెడన్ని ఉదంతాలతో ఆమె పేరు ముడిపడి ఉండాలి. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి.. ఇప్పటికి అంతో ఇంతో గాంధీ ఫ్యామిలీ నీతికి.. నిజాయితీకి కట్టుబడి ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇక..నేషనల్ హెరాల్డ్ విషయానికి వస్తే.. ప్రాథమికంగా ఈ ఇష్యూను చూసినప్పుడు తప్పు జరిగినట్లు కనిపిస్తుంది. కానీ.. కొన్ని తప్పుల్ని పట్టి పట్టి చూసే కన్నా.. చూడాల్సినంత మాత్రమే చూడాల్సిన అవసరం ఉంది.

అదెలా అన్నది మోడీ లాంటి నేతకు తెలియంది కాదు. విపక్ష పార్టీ అధ్యక్షురాలిని ఈడీ ముందుకు తీసుకురావటం ద్వారా.. మోడీ ఒకింత ఆనందాన్ని పొంది ఉండొచ్చు. అంత మాత్రాన కథ ఇక్కడితో ఆగదు. రాబోయే రోజులన్నవి ఒకటి ఉంటాయన్నది మర్చిపోకూడదు. అప్పట్లో అత్యంత శక్తివంతమైన ఇందిరమ్మకు అధికార గర్వభంగం ఏ రీతిలో జరిగిందో తెలిసిందే. తర తమ తేడాల్లేకుండా తాను అనుకున్న ఎజెండాకు తగ్గట్లు ముందుకు సాగటం రాబోయే రోజుల్లో రాజకీయంగా మరిన్ని క్లిష్ట పరిస్థితులకు కారణమవుతుంది. అందుకు మోడీ చెల్లించాల్సిన మూల్యం అంతో ఇంతో ఉంటుందన్నది మాత్రం మర్చిపోకూడదు.