Begin typing your search above and press return to search.

లోకేష్‌ చేస్తున్న పనికి చంద్రబాబు అనుమతి ఉందా?

By:  Tupaki Desk   |   6 March 2023 10:00 PM GMT
లోకేష్‌ చేస్తున్న పనికి చంద్రబాబు అనుమతి ఉందా?
X
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు 4 వేల కిలోమీటర్ల మేర లోకేష్‌ పాదయాత్ర చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఇప్పటికే ఆయన చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పాదయాత్ర ముగించుకున్నారు. జనవరి 27న ప్రారంభించిన పాదయాత్ర ఇప్పటికే నెల రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం లోకేష్‌ పాదయాత్ర అన్నమయ్య జిల్లా పీలేరులో సాగుతోంది. లోకేష్‌ పాదయాత్ర చేపట్టి మార్చి 5 నాటికి 35 రోజులు పూర్తయింది. ఆయన 500 కిలోమీటర్లు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

కాగా తన పాదయాత్రలో భాగంగా నారా లోకేష్‌ ఎక్కిడికక్కడ టీడీపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ సీట్లున్నాయి. ఇందులో కుప్పంతో కలిపి ఏడు స్థానాలకు లోకేష్‌ అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో భాగంగా కుప్పం తన తండ్రి చంద్రబాబు, పీలేరులో నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి, చంద్రగిరిలో పులివర్తి నాని, సత్యవేడులో డాక్టర్‌ హెలెన్, శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్‌ కుమార్‌ రెడ్డి, నగరిలో గాలి భానుప్రకాశ్, పలమనేరులో మాజీ మంత్రి అమరనాథ రెడ్డి పోటీ చేయనున్నారు.

ఇక 7 నియోజకవర్గాలకు.. తిరుపతి, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటిలో తిరుపతి, చిత్తూరు, పుంగనూరు, మదనలపల్లి నియోజకవర్గాలను జనసేనతో పొత్తు కుదిరితే ఆ పార్టీకి కేటాయించే అవకాశం ఉంది.

అయితే లోకేష్‌ అభ్యర్థులను ప్రకటించే ముందు.. తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సూచనల మేరకు నడుచుకుంటున్నాడో లేదో క్లారిటీ లేదంటున్నారు. అయితే అభ్యర్థులను ప్రకటించే సందర్భంగా లోకేష్‌ వారికి హామీలిస్తుండటం ఇబ్బంది అవుతుందేమోనని చర్చ జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఏడాది ముందుగానే అభ్యర్థులను లోకేష్‌ ప్రకటిస్తున్నారు. బలమైన అభ్యర్థులు అనుకున్నచోట లోకేష్‌ ఈ పని చేస్తున్నారు. అయితే ఇంకా ఎన్నికలకు ఏడాది సమయం ఉండటం, ఈలోపు మరింత మెరుగైన అభ్యర్థులు లభించడం, ఎన్నికల నాటికి జనసేన, వీలైతే బీజేపీతో కూడా పొత్తు కుదిరితే అప్పుడు కొన్ని సీట్లు అనివార్యంగా పొత్తులో భాగంగా ఆయా పార్టీలకు వదిలేయాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో పొత్తు కుదిరే పక్షంలో ఇప్పుడు అభ్యర్థులుగా ప్రకటించినవారిని పక్కనపెట్టకు తప్పదు. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అభ్యర్థులుగా ప్రకటించినవారిని ఎన్నికల సమయానికి పక్కనపెడితే వారి పరిస్థితి ఏమిటి? వారికి లోకేష్‌ ఎలాంటి హామీలు ఇస్తారన్న చర్చ జరుగుతోంది.
పోనీ పొత్తు కుదరని పక్షంలో ఇప్పుడు నియోజకవర్గాల అభ్యర్థులుగా ప్రకటించినవారిలో కొందరిని ఎన్నికల నాటికి మార్చాల్సిన పరిస్థితులు ఉంటే లోకేష్‌ పక్కనపెట్టినవారికి ఎలాంటి హామీలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారిందని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.