Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యేకు కేటీఆర్ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారా?

By:  Tupaki Desk   |   18 July 2022 4:10 AM GMT
ఆ ఎమ్మెల్యేకు కేటీఆర్ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారా?
X
వికారాబాద్ టీఆర్ఎస్ జిల్లా అధ్య‌క్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారా అంటే అవున‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. కొద్ది రోజుల క్రితం జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ సునీత మ‌హేంద‌ర్ రెడ్డి వికారాబాద్ లో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే మా నియోజ‌క‌వ‌ర్గంలో నీకేం ప‌ని అంటూ సునీత‌ కారుపై ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వ‌ర్గీయులు దాడి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ వ్య‌వ‌హారం కేటీఆర్ వ‌ద్ద‌కు చేరింద‌ని.. దీనిపై కేటీఆర్.. ఎమ్మెల్యే ఆనంద్ కు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యేల‌తో హైద‌రాబాద్ లో కేటీఆర్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ సునీతా మ‌హేంద‌ర్ రెడ్డి, ఆమె భ‌ర్త ఎమ్మెల్సీ, మాజీ మంత్రి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాద‌య్య‌, ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి, మెతుకు ఆనంద్ ల‌తో కేటీఆర్ భేటీ నిర్వ‌హించారు.

ఈ సంధర్బంగా వికారాబాద్ జిల్లా మర్పల్లిలో జరిగిన ఘటనపై జెడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తో విడివిడిగా మాట్లాడి అసలు ఏం జరిగింది? అని కేటీఆర్ ఆరా తీశారని సమాచారం. సునీతారెడ్డి చెప్పింది, అక్కడ జరిగింది తెలుసుకున్న కేటీఆర్ త‌ప్పంతా మెతుకు ఆనంద్ దేన‌ని నిర్ధారించిన‌ట్టు స‌మాచారం. దీంతో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ను మంద‌లించినట్టు చెబుతున్నారు.

సునీతమ్మ అంటే మన ఇంటి ఆడబిడ్డతో సమాన‌మ‌ని కేటీఆర్ చెప్పార‌ని అంటున్నారు. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో ఆమె పాత్ర చెరగని ముద్ర వేశార‌ని కొనియాడార‌ని చెబుతున్నారు. అలాంటి సునీత‌మ్మ గౌర‌వానికి ఇకపై ఎప్పుడు భంగం కలిగించొద్ద‌ని ఆదేశించిన‌ట్టు స‌మాచారం.

ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చిన అధికారాలు, బాధ్యతలను దుర్వినియోగం చేసి..ప్రతిపక్షాల దగ్గర చులకన అయ్యే ప‌నులు చేయొద్ద‌ని వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్‌కు కేటీఆర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇకపై పార్టీ అంతర్గత వ్యవహారాలు ఏ ఒక్కటి బయటకు రాకుండా పూర్తి భాద్యత తీసుకొని అంద‌రూ స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని కేటీఆర్ చెప్పిన‌ట్టు తెలుస్తోంది. కాగా తాము పార్టీ మారుతున్న‌ట్టు త‌మ‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని.. త‌మ‌కు అలాంటి ఆలోచ‌న లేద‌ని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సునీతారెడ్డిలు స్ప‌ష్టం చేసిన‌ట్టు స‌మాచారం. దీంతో పట్నం మ‌హేంద‌ర్ రెడ్డి కుటుంబానికి టీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ పూర్తి భరోసా ఇచ్చారని చెబుతున్నారు.