Begin typing your search above and press return to search.

కేసీయార్ నిర్ణయం మార్చుకున్నారా ?

By:  Tupaki Desk   |   30 Jun 2023 6:00 PM GMT
కేసీయార్ నిర్ణయం మార్చుకున్నారా ?
X
వచ్చే ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ పరిస్ధితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైందట. ఈ మధ్య నిర్వహించిన సమీక్షల్లో ప్రజల్లో ఆదరణలేని ఎంఎఏలకు మళ్ళీ టికెట్లిచ్చేది లేదని కరాఖండిగా చెప్పేశారు. అలాగే ఒకసారి మాట్లాడుతు 45 మంది ఎంఎల్ఏలపై బాగా అవినీతి ఆరోపణలున్నట్లు చెప్పారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నవాళ్ళకి ఎట్టి పరిస్ధితుల్లోను టికెట్లిచ్చేది లేదని తెగేసిచెప్పారు. అయితే అవన్నీ నీటిమీద రాతలేనని తాజా పరిణామాలు చెబుతున్నాయి.

దీనికి కారణం ఏమిటంటే జనాల్లో వ్యతిరేకత ఉందనో లేకపోతే అవినీతి కారణంగానో టికెట్లు ఇవ్వకపోతే వాళ్ళంతా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఏదోపార్టీలో చేరిపోతారనే టెన్షన్ పెరిగిపోతోందట. వివిధ సర్వేల వివరాలను చెప్పిన కేసీయార్ సుమారు 35 మంది సిట్టింగులకు నో టికెట్ అని పరోక్షంగా ప్రకటించారు. కర్నాటకలో కాంగ్రెస్ ఘనవిజయం తర్వాత తెలంగాణా రాజకీయాల్లో మార్పులు వచ్చేశాయి. తెలంగాణా కాంగ్రెస్ నేతల్లో మంచి జోష్ పెరిగిపోయింది.

ఇదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీల్లో నుండి కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరిపోయారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎంఎల్సీ దామోధరరెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ లో చేరిపోయారు.

తొందరలోనే వాళ్ళ నియోజకవర్గాల్లో బహిరంగసభలు నిర్వహించి కాంగ్రెస్ కండువాలు కప్పుకోబోతున్నారు. ఇవన్నీ గమనించిన తర్వాత టికెట్లిచ్చేది లేదని గనుక చెప్పేస్తే సిట్టింగ్ ఎంఎల్ఏలు వెంటనే అయితే కాంగ్రెస్ లేదా బీజేపీలోకి వెళ్ళిపోవటం ఖాయమనే విషయం కేసీయార్ కు అర్ధమైందట.

అందుకనే ముందుగా ప్రకటించిన 35 మందికి కాకుండా పనితీరు+జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న వాళ్ళకి మాత్రం టికెట్లు ఇవ్వకూడదని మిగిలిన వాళ్ళకు మళ్ళీ టికెట్లివ్వాలని అనుకున్నట్లు పార్టీవర్గాల టాక్. ఇందులో భాగంగానే టికెట్లిచ్చేది లేదని గతంలో చెప్పిన వాళ్ళల్లో కొందరికి ఫోన్ చేసి టికెట్ ఖారరైనట్లు కేసీయారే చెప్పినట్లు సమాచారం.

తాజా లెక్కల ప్రకారం మహాయితే ఓ 15 మందికి మాత్రం టికెట్లిచ్చేది లేదని కేసీయార్ చెప్పవచ్చని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. అదికూడా చివరవరకు నాన్చి అప్పుడు చెబుతారట. అంతవరకు ఆగటానికి ఎంఎల్ఏలేమన్నా అమాయకులా ?