Begin typing your search above and press return to search.

ఈ నలుగురు ఎమ్మెల్యేలను జగన్‌ హెచ్చరించారా?

By:  Tupaki Desk   |   14 Feb 2023 9:59 AM GMT
ఈ నలుగురు ఎమ్మెల్యేలను జగన్‌ హెచ్చరించారా?
X
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ తాజాగా కీలక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లాల సచివాలయాల కన్వీనర్లు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం సమీక్షించారు. ఈ కార్యక్రమాన్ని సరిగా నిర్వహించని వారి పేర్లను సీఎం జగన్‌ సమావేశంలో చదివారని తెలుస్తోంది.

16 అసెంబ్లీ నియోజకవర్గాలతో కీలకమైన జిల్లాగా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడంలో వెనుకబడ్డారని సీఎం హెచ్చరించారు. ఈ నలుగురిలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ వెనుకబడ్డారు.

ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సరిగా నిర్వహించనివారికి వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేది లేదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సామాజికవర్గాల పరంగా, ఆర్థిక, అంగ బలాల పరంగా, తమకంటూ ఒక సొంత ఇమేజ్‌ ను సృష్టించుకున్న నేతలుగా పేరున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ, సామినేని ఉదయభానులను తప్పించే సాహసం జగన్‌ చేయగలరా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

కాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఇప్పటివరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. మంత్రి జోగి రమేష్‌ కు, ఆయనకు ఇటీవల వరకు విభేదాలు సాగాయి. సీఎం జగన్‌ సమక్షంలో పంచాయతీతో ఈ గొడవ సద్దుమణిగింది. జోగి రమేష్‌ మైలవరం నియోజకవర్గంలో ఇక నుంచి జోక్యం చేసుకోరని సీఎం జగన్‌ తేల్చిచెప్పడంతో వసంత కృష్ణప్రసాద్‌ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మొదలు పెట్టనున్నారు.

టీడీపీ, జనసేన అధినేతలపై నిప్పులు చెరిగే గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహణలో బాగా వెనుకబడి ఉన్నారని స్వయంగా సీఎం జగనే తేల్చిచెప్పారు. అలాగే టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ లక్ష్యం మేరకు పూర్తి చేయడంలో వెనుకబడ్డారని తేల్చారు.

అదేవిధంగా రెండో విడతలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ సామినేని  ఉదయభాను వెనుకంజలో ఉన్నట్లు సీఎం జగన్‌ వెల్లడించారు. గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహణలో వెనుక బడినా.. అలసత్వం ప్రదర్శించినా వచ్చే ఎన్నికలలో పార్టీ టిక్కెట్‌ ఉండదని సీఎం జగన్‌ హెచ్చరికల నేపథ్యంలో ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఇక జోరు పెంచాల్సిన అవసరం ఉందనే టాక్‌ నడుస్తోంది. అందులోనూ కీలకమైన కృష్ణా జిల్లాలో ఏమాత్రం అలసత్వానికి చోటు ఇవ్వకూడదని జగన్‌ భావిస్తున్న నేపథ్యంలో ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఏం చేయబోతున్నారో వేచిచూడాల్సిందే!
 


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.