Begin typing your search above and press return to search.

మోడితో జగన్ విభేదించారా ?

By:  Tupaki Desk   |   3 March 2021 5:30 AM GMT
మోడితో జగన్ విభేదించారా ?
X
తాజాగా ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన వెబినార్ సదస్సులో ప్రధనామంత్రి నరేంద్రమోడి ఆలోచనలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విభేదించారా ? తాజాగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన బ్యానర్ కథనం చదివితే ఇదే అర్ధమవుతుంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి కేంద్రప్రభుత్వానికి సాగిలపడ్డారని ఆంధ్రజ్యోతిలోనే కథనాలు గుప్పిస్తుంటారు. మరి తాజాగా మోడి పిలుపుకు భిన్నంగా జగన్ మరో ప్రతిపాదన వినిపించారంటే ఏమిటర్ధం ?

పోర్టులన్నింటినీ ప్రైవేటు సంస్ధలకు అప్పగించేందుకు కేంద్రప్రభుత్వం రంగం సిద్దంచేస్తోంది. ఇందులో భాగంగానే పోర్టుల నిర్మాణం, నిర్వహణ తదితరాల్లో ప్రైవేటు సంస్ధలకే పెద్దపీట వేయాలని తాజాగా మోడి వెబినార్ సదస్సులో పిలుపిచ్చారు. అయితే ఇదే సదస్సులో పాల్గొన్న జగన్ మాత్రం మోడి పిలుపుతో విభేదించారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులను విషయంలో రాష్ట్రప్రభుత్వం వినూత్న పద్దతిని అనుసరిస్తున్నట్లు మోడికి జగన్ స్పష్టంగా చెప్పారట.

పోర్టులను ప్రభుత్వమే నిర్మిస్తుందని జగన్ తేల్చి చెప్పేశారు. నిర్మాణాలు పూర్తయిన తర్వాత నిర్వహణకు మాత్రం ప్రైవేటుసంస్ధలకు అప్పగిస్తామని చెప్పారు. ఈ ప్రక్రియను ఓపెన్ బిడ్డింగ్ ద్వారా నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం ఇచ్చే సంస్ధలనే ప్రభుత్వం ఎంపిక చేస్తుందని జగన్ వివరించారు. నిజానికి పోర్టుల విషయం రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది నిర్మాణం. రెండోది నిర్వహణ. నిర్మాణం ఎంత కీలకమో నిర్వహణా అంటే కీలకం. ఇంకా చెప్పాలంటే నిర్మాణం కన్నా నిర్వహణే కష్టం.

నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఏదో ప్రైవేటుసంస్ధకు అప్పగించి పర్యవేక్షణ చేస్తుంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ తర్వాత నిర్వహణ దగ్గరకు వచ్చేసరికి రోజువారీ ఖర్చుల్లాంటి చాలా సమస్యలే ఉంటాయి. అందుకనే నిర్మాణాన్ని ప్రభుత్వమే చేసి నిర్వహణను మాత్రం ఓపెన్ బిడ్డింగ్ ద్వారా ప్రైవేటుసంస్ధకు అప్పగిస్తామన్నారు. తాజాగా జరిగిన వెబినార్ ద్వారా మోడి ప్రతిపాదనను జగన్ విభేదించారని స్పష్టమవుతోంది. అంటే మోడికి జగన్ సాగిలపడ్డారన్నది తప్పని తేలినట్లేనా ?