Begin typing your search above and press return to search.

ఆ మూడింటిపైనే దీదీ ఆశలు పెట్టుకున్నదా ?

By:  Tupaki Desk   |   19 March 2021 1:30 PM GMT
ఆ మూడింటిపైనే దీదీ ఆశలు పెట్టుకున్నదా ?
X
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. నందిగ్రామ్ లో నామినేషన్ వేసిన రోజే మమతాబెనర్జీ కాలికి గాయమైన విషయం తెలిసిందే. దాంతో ప్రచారంలో దూకుడు తగ్గిపోయినా దీదీ మాత్రం ప్రచారాన్ని ఆపలేదు. చక్రాల కుర్చీలోనే కూర్చుని రాష్ట్రమంతా తిరిగేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రధానంగా మూడు అంశాలపైనే దీదీ బాగా ఆశలు పెట్టుకున్నట్లు అనిపిస్తోంది. మొదటిదేమిటంటే తన కాలికి గాయం కారణంగా సింపథీ.

ఇక రెండో కారణం ఏమిటంటే మ్యానిఫెస్టోలో తాను గుప్పించిన ఉచితాల హామీలవర్షం. ముచ్చటగా మూడోదేమిటంటే ప్రధానమంత్రి నరేంద్రమోడి సర్కార్ పై జనాల్లో పెరిగిపోతున్న వ్యతిరేకత. ఈ మూడుగనుక వర్కవుటైతే ముచ్చటగా తాను హ్యాట్రిక్ కొట్టచ్చనేది మమత ఆశలుగా తెలుస్తోంది. కాలికి అయిన గాయం విషయంలో జనాల్లో మిశ్రమ స్పందన కనబడుతోంది. తనపై హత్యాయత్నానికి బీజేపీ కుట్ర చేసిందని మమత బాహాటంగానే ఆరోపించారు.

అయితే మమత ఆరోపణలను చాలామంది నమ్మటం లేదు. అయితే కాలికి గాయమైన విషయంలో మాత్రం అనుమానించటంలేదు. మరి కాలికి తగిలిన గాయం విషయం భగవంతుడికే తెలియాలి. ఇక ఉచితాల హామీల వర్షాన్ని కురిపించేశారు. తానిచ్చిన ఉచితాల హామీలను ఎంతవరకు అమలు చేస్తుందో జనాలకు అర్ధం కావటంలేదు. సరే ప్రధాన ప్రత్యర్ధయిన బీజేపీ కూడా ఇలాంటి హామీలే గుప్పిస్తోంది కాబట్టి ఎవరికీ సమస్యే లేదు.

ఇక మోడిపై వ్యతిరేకత పైనే ప్రధానంగా ఆశలు పెట్టుకున్నారు. పెట్రోలు, డీజల్, గ్యాస్ తో పాటు చాలా నిత్యవసరాల ధరలు మండిపోతున్నాయి. ఇదే సమయంలో పరిశ్రమలను మూసేస్తున్నారు. రాష్ట్రంలోని దుర్గాపూర్ ఉక్కు పరిశ్రమ కూడా మూసివేత జాబితాలో ఉంది. కాకపోతే ఎన్నికల కారణంగా ప్రకటించలేదట. ఇదే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా రైతుఉద్యమ సంఘాలు ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో బహిరంగ సభలు నిర్వహిస్తు బీజేపీ అభ్యర్ధులకు ఓట్లేయద్దని చెబుతున్నాయి. కాబట్టి ఇలాంటి అంశాలు సానుకూలమైతే మమత హ్యాట్రిక్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు.