Begin typing your search above and press return to search.

దీదీ ముహూర్తం ఫిక్స్ చేసిందా ?

By:  Tupaki Desk   |   26 July 2021 5:35 AM GMT
దీదీ ముహూర్తం ఫిక్స్ చేసిందా ?
X
నరేంద్రమోడి సర్కార్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావటానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతబెనర్జీ ముహూర్తం నిర్ణయించారా ? క్షేత్రస్ధాయిలోని పరిస్ధితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈనెల 28వ తేదీన ఢిల్లీలో ప్రతిపక్ష నేతలందరినీ ఒకచోట చేర్చాలని దీదీ ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టేశారు. విచిత్రమేమిటంటే 28వ తేదీన ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోడితో మమత భేటీ అవబోతున్నారు.

మోడితో భేటీ అయిపోగానే అదేరోజు మధ్యాహ్నం పైన ప్రతిపక్ష నేతలతో సమావేశం ఏర్పాటుకు రెడీ అవుతున్నారు. ప్రతిపక్షాలన్నింటినీ సమావేశానికి రప్పించేందుకు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, కాంగ్రెస్ కీలక నేత చిందంబరం చొరవ తీసుకోవాలని దీదీ రిక్వెస్టు చేశారు. వీళ్ళద్దరినీ ఫాలోఅప్ చేసే బాధ్యతను తన మేనల్లుడు, తృణమూల్ పార్టీలో కీలక నేతైన అభిషేన్ బెనర్జీ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు అప్పగించారు. వీళ్ళద్దరు ఇదే పనిపై ఈనెల 22వ తేదీనుండి ఢిల్లీలోనే ఉన్నారు.

మొత్తానికి మోడికి వ్యతిరేకంగా బలమైన ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలనే పట్టుదల మమతలో రోజురోజుకు పెరిగిపోతోంది. 28వ తేదీన విపక్షాల సమావేశం గనుక సక్సెస్ అయితే ఈ ఏడాదిచివరలో కోలకత్తాలో బ్రహ్మాండమైన బహిరంగసభ నిర్వహించాలని కూడా దీదీ ఇప్పటికే డిసైడ్ అయ్యారట. దీదీ వరసు చూస్తుంటే తొందరలోనే బెంగాల్ ను వదిలేసి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించటం ఖాయమన్నట్లే ఉంది.

మోడికి వ్యతిరేకంగా మమత ఇంతగట్టి ప్రయత్నాలు చేయటం వెనుక కీలకమైన కారణమే ఉందంటున్నారు పరిశీలకులు. కాలేజీలో జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేసినట్లే బెంగాల్ ఎన్నికలకు ముందు నరేంద్రమోడి, అమిత్ షాలు మమతను బాగా ఇబ్బందిపెట్టారు. ఎన్నికలకు ముందు అడుగడుగునా చాలా అవమానాలకు గురిచేశారు. తృణమూల్ ఎంఎల్ఏలను, సీనియర్ నేతలకు లాగేసుకున్నారు. ఒత్తిళ్ళకు లొంగకుండా మమతతోనే ఉన్న కొందరు నేతలపై కేసులు పెట్టించారు.

ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మమత ఓడిపోయుంటే పరిస్దితులు ఎలాగుండేదో తెలీదు. అయితే మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టగానే మోడి, అమిత్ పై దీదీలో కసి ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతోనే మోడిని ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో దెబ్బకొట్టాలనే పట్టుదల పెరిగిపోతోంది. అందుకనే విపక్షాల ఐక్యతకు కాలికి బలపం కట్టుకుని మరీ తిరుగుతున్నారు. చివరకు బద్ధ శతృవైన కాంగ్రెస్ తో సైతం చేతులు కలపటానికి సిద్ధమవ్వటంతోనే దీదీలో కసి ఏమిటో తెలిసిపోతోంది. చూద్దాం 28వ తేదీన ఏమి జరుగుతుందో.