Begin typing your search above and press return to search.

కోమ‌టిరెడ్డి ఉంటారా... వెళ‌తారా.. హైక‌మాండ్ స్ట్రాంగ్ వార్నింగ్ ?

By:  Tupaki Desk   |   28 Jun 2021 3:27 AM GMT
కోమ‌టిరెడ్డి ఉంటారా... వెళ‌తారా.. హైక‌మాండ్ స్ట్రాంగ్ వార్నింగ్ ?
X
తెలంగాణ నూత‌న పీసీసీ అధ్య‌క్షుడిగా మ‌ల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియ‌మించింది. రేవంత్‌కు ఈ ప‌దవి ఇవ్వ‌డంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ర‌గులుతున్నారు. ఇక కొంద‌రు నేత‌లు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి, ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి రేవంత్ రెడ్డి నియామ‌కంపై తీవ్ర‌స్థాయిలో త‌న అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఓటుకు నోటు కేసు నుంచి ఎలా లాబీయింగ్ చేశాడో ? అలాగే లాబీయింగ్ చేసి టీ పీసీసీ ప‌ద‌వి కూడా తెచ్చుకున్నాడంటూ రేవంత్‌పై మండిప‌డ్డారు. తాను సోనియా, రాహుల్‌ను విమ‌ర్శించ‌నూ అంటూనే ఇక‌పై గాంధీభ‌వ‌న్ మెట్లు కూడా ఎక్క‌ను అని.. త‌న నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం అవుతాన‌ని చెప్పారు.

ఈ ప‌ద‌విని మాణిక్యం ఠాగూర్ అమ్ముకున్నార‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డంతో పాటు ఇక‌పై టీ కాంగ్రెస్ కూడా టీ టీడీపీ మాదిరిగానే మారబోతోందని కామెంట్ చేశారు. 2023 వ‌ర‌కు తాను గాంధీభ‌వ‌న్ వైపే చూడ‌డ‌నన్నారు. ఇక కార్య‌క‌ర్త‌ల కోసం భువ‌న‌గిరి నుంచి ఇబ్ర‌హీంప‌ట్నం వ‌ర‌కు పాద‌యాత్ర చేస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేశారు. కోమ‌టిరెడ్డి లాంటి సీనియరే ఈ స్థాయిలో విమ‌ర్శ‌లు చేయ‌డంతో అది మిగిలిన అసంతృప్త నేత‌ల‌కు కూడా అలుసుగా మారింది. దీంతో ఎవ‌రికి వారు ఇష్ట‌మొచ్చిన‌ట్టుగా మాట్లాడుతున్నారు. దీంతో కోమ‌టిరెడ్డి వ్యాఖ్య‌లు తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి.

పార్టీలో ఇప్ప‌టికే క్ర‌మ‌శిక్ష‌ణ లేదు. దీంతో మ‌రింత గాడి త‌ప్పుతుండ‌డంతో కొంద‌రు నేత‌లు న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేర‌కు కోమ‌టిరెడ్డి వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నారు. ఇక కోమ‌టిరెడ్డి సైతం అధిష్టానంతో తాడోపేడో అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుండడంతో ఏఐసీసీ సైతం కోమ‌టిరెడ్డి నుంచి వివ‌ర‌ణ కోర‌కుండానే అవ‌స‌రం అయితే పార్టీ నుంచి స‌స్పెండ్ చేసే యోచ‌న‌లో కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ నియామ‌కం రాహుల్‌, సోనియా ఆదేశాల మేర‌కు జ‌రిగింద‌ని.. అయితే ఠాగూర్ ఈ ప‌ద‌వి అమ్ముకున్న‌ట్టు మాట్లాడ‌డాన్ని ఠాగూర్ సైతం స‌హించ‌లేక‌పోతున్నార‌ని తెలుస్తోంది. ఏదేమైనా కోమ‌టిరెడ్డి ఇదే పంతంతో ఉంటే ఆయ‌న పార్టీ నుంచి బ‌య‌ట‌కు వస్తారా ? లేదా వేటు వేస్తారా ? అన్న‌ది చూడాలి.