Begin typing your search above and press return to search.

చిరంజీవి కి సీఎం జగన్ బంపరాఫర్

By:  Tupaki Desk   |   14 Feb 2020 6:15 AM GMT
చిరంజీవి కి సీఎం జగన్ బంపరాఫర్
X
మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజ్యసభ పదవి పొందే అవకాశం ఉంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు, కాంగ్రెస్ కు చెందిన మహ్మద్ అలీఖాన్, టి.సుబ్బిరామిరెడ్డి, టీడీపీకి చెందిన సీతామహాలక్ష్మి ఏప్రిల్ 9వ తేదీతో వీరి పదవీకాలం ముగియనుంది. దీంతో ఈ స్థానాలు ఎవరికి ఇవ్వాలో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చిందంట. భవిష్యత్ రాజకీయాలు, సామాజికపరంగా అన్నీ చూసి కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి ఒక రాజ్యసభ సీటు ఇవ్వాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. మారిన రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా ఈ మేరకు చిరంజీవికి రాజ్యసభ పదవి ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం.

త్వరలో ఖాళీ కానున్న ఆ నాలుగు స్థానాల్లో భర్తీ కి పార్టీ సన్నాహాలు చేస్తోంది. అయితే వీటిలో ఒకటి చిరంజీవికి కేటాయిస్తారనే వార్త హల్ చల్ చేస్తోంది. తమ పార్టీకి చెందిన వాడు కాకపోయినా రాజ్యసభ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయాలు మారుతున్నాయి. బీజేపీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దోస్తీ కట్టాడు. ఈ నేపథ్యంలో వారి నుంచి ఇబ్బందులు ఏర్పడుతాయనే ఉద్దేశంతో రాజ్యసభ చిరంజీవికి ఇచ్చే అవకాశం ఉంది. అయితే చిరంజీవి కాంగ్రెస్ కు చెందిన వ్యక్తి ఉండగా అతడిని ఎలా రాజ్యసభ కు పంపిస్తారా అని అందరూ ఆలోచిస్తారు.

తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి మెగాస్టార్ పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. అంటే కళాకారుడు కావడంతో చిరంజీవిని కళాకారుల జాబితాలో రాజ్యసభ పంపించే యోచనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కళాకారుల కోటా కింద చిరంజీవి ని పంపిస్తే విమర్శలు రాకుండా ఉండేలా జాగ్రత్త పడుతోంది. అయితే చిరంజీవి ని రాజ్యసభ కు పంపడం తో రాజకీయం గా లబ్ధి పొందుతామనే ఆశతో ఆ పార్టీ ఉంది. పవన్ కల్యాణ్ రాష్ట్రంలో కొంత ప్రభావం చూపిస్తున్నాడు. అతడి వేడి తగ్గించడానికి ఆయన అన్నయ్య చిరంజీవిని ఆ విధంగా పంపిస్తే పవన్ చల్లబడతాడని, చిరంజీవి ఎంట్రీతో పవన్ సైలెంట్ అయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తోంది. మరీ ఏ నిర్ణయం తీసుకుంటుందో.. భవిష్యత్ ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఒకవేళ చిరంజీవికి రాజ్యసభ సీటు వస్తే మళ్లీ రాజకీయాల్లోకి బాస్ ఈజ్ బ్యాక్ అవుతుంది.