Begin typing your search above and press return to search.

ఆ ప్రెస్ నోట్ తో కమలనాథులను జనసేనాని ఇరిటేట్ చేశారా?

By:  Tupaki Desk   |   3 Sep 2021 4:48 AM GMT
ఆ ప్రెస్ నోట్ తో కమలనాథులను జనసేనాని ఇరిటేట్ చేశారా?
X
మిగిలిన రంగాల సంగతిని పక్కన పెడితే.. రాజకీయ రంగంలో చోటు చేసుకునే ప్రతి పరిణామం వెనుక లెక్క మరోలా ఉంటుంది. ఉత్తినే ఏది జరగదు. ఈ మధ్యన చోటు చేసుకున్న ఒక పరిణామం ఏపీ బీజేపీలో హాట్ టాపిక్ గా మారటమే కాదు.. ఏపీ రాజకీయాల్లో పవన్ చర్చ మరింత పెరిగేలా చేసింది. బీజేపీకి బద్ధ శత్రువు.. మోడీ తీరును ఏ మాత్రం ఇష్టపడని ముఖ్యమంత్రుల్లో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఒకరుగా చెబుతారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ.. తండ్రి కారణంగా సీఎం పదవిని చేపట్టని ఆయన.. దశాబ్దాల కలను ఇటీవల నెరవేర్చుకున్న విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నాటి నుంచి తరచూ సంచలనంగా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి. రాజకీయాల్లో సంచలనం అంటే పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ గానే చూస్తారు.కానీ.. స్టాలిన్ విషయంలో మాత్రం భిన్నం. ఆయన నిర్ణయాలు అందరూ హర్షించేలా.. అధినేత అనేవాడు ఇలా ఉండాలన్నట్లుగా ఉంటోంది. తమిళనాడు అన్నంతనే వ్యక్తిపూజ ఎంత ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో.. అందునా అధికారంలో ఉన్న అధినేత అడుగులకు మడుగులు ఒత్తటం తమిళ తంబీల్లో చూస్తుంటాం.

అలాంటి తన పార్టీ నేతలకు స్టాలిన్ ఈ మధ్యన షాకివ్వటం తెలిసిందే. అసెంబ్లీలో తనను అదే పనిగా పొగడొద్దని చెప్పి అందరి ఆశల మీద నీళ్లు చల్లిన ఆయన.. తనను పొగిడే వారి మీద చర్యలు తప్పదంటూ వార్నింగ్ ఇవ్వటం అందరిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. ఇలా సొంత పార్టీలోనే కాదు.. తమిళనాడులోని మిగిలిన పార్టీలకు ఆయన ఇప్పుడు మింగుడుపడనట్లుగా మారారు. అదే సమయంలో కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా స్టాలిన్ సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇది జరిగిన రెండు రోజులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక ప్రెస్ నోట్ ను తన చేతి సంతకంతో రిలీజ్ చేశారు. అందులో స్టాలిన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ పొగిడేశారు.

ఈ వైనం ఏపీ బీజేపీ నేతలకు కంటగింపుగా మారింది. తమ మిత్రపక్షంగా వ్యవహరిస్తూ.. తమకు ప్రత్యర్థి పార్టీ విధానాల్ని.. ముఖ్యంగా కేంద్ర సర్కారు తీసుకొచ్చిన చట్టాన్ని దెబ్బ తీసేలా ఉండే తీర్మానంపై జగన్ రియాక్టు కావటాన్ని కమలనాథులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమకు తోక పార్టీగా ఉండాల్సిన జనసేన అందుకు భిన్నంగా తమకు రాజకీయ ప్రత్యర్థి అయిన డీఎంకేను జనసేనాని పొగడటంపై బీజేపీ నేతలు కోపంతో ఉన్నట్లు చెబుతున్నారు.

స్టాలిన్ ను ఒక రేంజ్ లో పొగిడేసిన పవన్.. ‘మీరు రాజకీయ నేతలందరికి ఆదర్శం. మీ పాలన.. మీ ప్రభుత్వ పనితీరు ఒక్క రాష్ట్రానికే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు.. రాజకీయ పార్టీలకు మార్గదర్శకంగా నిలిచారంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఈ వ్యాఖ్యలన్ని తమను దెబ్బ తీసేవన్న ఆగ్రహాన్ని బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. స్టాలిన్ పై పవన్ పొగడ్తల విషయంలో బీజేపీ లైన్ ను ధిక్కరించారని చెబుతున్నారు.

దీనికి వివరణ అడుగుతారని తెలుస్తోంది. అయితే.. తన స్వేచ్ఛ విషయంలో బీజేపీ నేతలు అడ్డు వస్తే.. వారికి కటీఫ్ చెప్పేందుకు పవన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిజానికి బీజేపీ అగ్రనాయకత్వం తీరుపై గుర్రుగా ఉన్న పవన్.. తను అనుసరించే సిద్దాంతానికి భిన్నంగా బీజేపీ తీరు ఉందన్నట్లుగా ఆయన భావన ఉందంటున్నారు. ఇందుకు తగ్గట్లు.. సమయానికి తగ్గట్లు తన అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పేందుకు పవన్ వెనుకాడటం లేదంటున్నారు.