Begin typing your search above and press return to search.

కాపులపై బీజేపీ అధిష్టానం ఆశలు వదులుకున్నట్టేనా?

By:  Tupaki Desk   |   7 July 2023 12:44 PM GMT
కాపులపై బీజేపీ అధిష్టానం ఆశలు వదులుకున్నట్టేనా?
X
కర్ణాటకలో అతిపెద్ద సామాజికవర్గంగా ఉన్న లింగాయత్‌ లను చేరదీసి గతంలో అధికారంలోకి వచ్చింది.. బీజేపీ. ఇదే తీరులో ఆంధ్రప్రదేశ్‌ లోనూ అతిపెద్ద సామాజికవర్గంగా ఉండి.. ఇప్పటివరకు అధికారంలోకి రాలేకపోయిన కాపు సామాజికవర్గాన్ని చేరదీసింది. తద్వారా గతంలో కర్ణాటకలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌ లోనూ అధికారంలోకి రావాలని ఆశించింది. ఇందులో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను కాపు సామాజికవర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణకు అప్పగించింది. ఆయనను తప్పించాక కాపు వర్గానికే చెందిన సోము వీర్రాజుకు ఇచ్చింది.

అయితే.. కాపుల నుంచి బీజేపీలో పెద్దగా చేరికలు చోటు చేసుకోలేదు. పెద్ద నాయకులంతా వైసీపీలో ఉండగా.. కాపు సామాజికవర్గం మొత్తం ఈసారి జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ తో నడవడానికి సిద్ధంగా ఉందనే టాక్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కాపులను నమ్ముకోవడం వల్ల ఏపీలో ఎలాంటి ప్రయోజనం లేదని బీజేపీ అధిష్టానం భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంతోనే సోము వీర్రాజును పదవి నుంచి తప్పించారని అంటున్నారు.

గతంలో ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను కమ్మ సామాజికవర్గం చేతుల్లో పెట్టింది.. బీజేపీ అధిష్టానం. వెంకయ్య నాయుడు, కంభంపాటి హరిబాబు వంటివారు బాధ్యతలు చేపట్టారు. అయితే వీరు పార్టీని ఎదగనీయడం లేదని.. తమ సామాజికవర్గానికే చెందిన మరో పార్టీ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉండేవి. బీజేపీ.. టీడీపీ నీలినీడన బ్రతికేలా వెంకయ్య నాయుడు, కంభంపాటి హరిబాబు చేశారనే విమర్శలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే కమ్మ సామాజికవర్గం చేతుల్లో ఉన్న ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను కాపు సామాజికవర్గానికి అప్పగించింది. కర్ణాటకలో లింగాయత్‌ లకు పెద్దపీట వేసినట్టు.. ఏపీలోనూ కాపు సామాజికవర్గాన్ని చేరదీసి అధికారంలోకి రావాలని తలచింది.

అయితే తానొకటి తలిస్తే.. మరేదో అయినట్టు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు ఇద్దరూ బీజేపీలో కాపు నేతల చేరికలను ప్రోత్సహించలేకపోయారు. మరోవైపు వారిద్దరూ కాపులే అయినప్పటికీ ఆ సామాజికవర్గంలో వారికి అంత చరిష్మా లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. కన్నా లక్ష్మీనారాయణ కూడా టీడీపీలో చేరిపోయారు.

ఈ క్రమంలో మరోమారు కమ్మ సామాజికవర్గాన్ని నమ్ముకుని బీజేపీ అడుగులేస్తోంది. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరికి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించడం ఇందులో భాగమేనని అంటున్నారు. తద్వారా బీజేపీ అధిష్టానం కాపులపై ఆశలు వదులుకున్నట్టేననే అభిప్రాయం వినిపిస్తోంది.