Begin typing your search above and press return to search.

ఆ చిన్నారి పోటో పట్టుకొని దేశమంతా వెతికారు

By:  Tupaki Desk   |   25 Dec 2015 4:56 AM GMT
ఆ చిన్నారి పోటో పట్టుకొని దేశమంతా వెతికారు
X
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మాటలకు నిలువెత్తు నిదర్శనం ఈ ఘటన. మనసును కదిలించిన ఒక ఫోటోలోని పాపకు సాయం చేసేందుకు ఆస్ట్రేలియా నుంచి భారత్ కు వచ్చి మరీ గాలించి.. ఆమె అడ్రస్ తెలుసుకొని సాయం చేసిన తీరు చూస్తే.. మనసు కదలించక మానదు. సినిమాటిక్ గా ఉండే ఈ వ్యవహారం చూస్తే.. దేవుడు ఎక్కడో లేడు.. మనిషిలోనే ఉన్నాడనిపిస్తుంది.

ఆస్ట్రేలియాకు చెందిన డిక్ స్మిత్ భారత్ లో పర్యటించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్న ఆయన.. రైల్లో ప్రయాణించే సమయంలో బ్రిడ్జ్ కింద బట్టల్లేకుండా పరుగులు తీస్తున్న ఒక చిన్నారిని చూసి.. వెనువెంటనే తన కెమేరాతో ఆమె ఫోటోను తీశాడు. ఆమె వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని భావించినా ముందుగా ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ ప్రకారం ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు.

స్వదేశానికి చేరుకున్నా.. తాను తీసిన ఫోటోలోని చిన్నారి ఆలోచనలు అతని మదిని వదలని పరిస్థితి. ఆ పాపకు సాయం చేయాలని డిసైడ్ అయిన ఆయన.. అందుకు తన స్నేహితుల్ని పిలిచి.. భారత్ కు వెళ్లి ఆ చిన్నారి చిరునామాను తెలుసుకోవాలంటూ క్రిస్.. జెస్ లకు చెప్పి పంపారు. వారిద్దరూ భారత్ కు చేరుకున్నారు. డిక్ స్మిత్ తీసిన ఐఫోన్ లో ఉన్న టెక్నాలజీ సాయంతో ఆ ఫోటోను తీసిన ప్రాంతం గుజరాత్ లోని వడోదరగా తెలుసుకున్నారు. వెంటనే అక్కడకు వెళ్లి.. ఒక హోటల్లో దిగిన వారు.. ఆ హోటల్ రిసెప్షెనిస్ట్ సాయంతో ఆ పాప కనిపించిన ప్రాంతాన్ని గుర్తించే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంలో వీరికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే.. వీరి తపనను అర్థం చేసుకున్న స్థానికులు వీరికి అండగా నిలవటంతో.. కేవలం రెండురోజుల వ్యవధిలో ఆ చిన్నారి చిరునామాను పట్టేశారు. ఆమె దివ్యగా గుర్తించారు. ఆ పాప తల్లిదండ్రులు నిరుపేదలని తెలిసిన వారు.. అప్పటికప్పుడు వారికి అవసరమైన వస్తువుల్ని కొనిపించి.. ఆస్ట్రేలియాలోని డిక్ స్మిత్ కు పాప సమాచారాన్ని అందించారు. ఆయన సూచన మేరకు చిన్నారి పేరిట ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయటమే కాదు.. దివ్యను మంచి స్కూల్లో చేర్పించారు. ఆమెకు అయ్యే ఖర్చులన్నీ తనవేనని.. ప్రతి నెలా కొంత డబ్బు పంపుతానని మాట ఇచ్చారు. ఆమె జీవితాన్ని మారుస్తానని చెప్పిన తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. దేశం కాని దేశానికి చెందిన ఒక చిన్నారికి సాయం చేసేందుకు ఇంతగా శ్రమించిన డిక్ స్మిత్.. అతని స్నేహితుల వ్యవహారంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.