Begin typing your search above and press return to search.

వ‌జ్రాల వ్యాపారం.. గుజ‌రాతీ వ్యాపారి రూ.8500 కోట్ల మోసం!

By:  Tupaki Desk   |   9 Oct 2022 8:31 AM GMT
వ‌జ్రాల వ్యాపారం.. గుజ‌రాతీ వ్యాపారి రూ.8500 కోట్ల మోసం!
X
న‌కిలీ క్రెడిట్ లైనును ఉప‌యోగించుకుని బ్యాంకుల‌కు, రుణాలిచ్చిన సంస్థ‌ల‌కు రూ.8500 కోట్ల శ‌ఠ‌గోపం పెట్టిన గుజరాత్ వ‌జ్రాల వ్యాపారి కుంభ‌కోణం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ యజమాని జతిన్ మెహతా, ఆయ‌న‌ కుటుంబం సంయుక్తంగా ఈ మోసానికి పాల్పడినట్లు వెల్ల‌డైంది. ఈ కుంభ‌కోణం విలువ దాదాపు రూ.8,500 కోట్లని అధికారులు చెబుతున్నారు.

1985లో జతిన్ మెహతా తన కుమారుడు పేరుతో సూరజ్ డైమండ్ ఇండియా లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విదేశాల నుంచి పాలిష్ చేయ‌ని వజ్రాలను తీసుకుని పాలిష్ చేసి మ‌ళ్లీ ఎగుమతి చేసేవారు. అదేవిధంగా విన్సమ్ డైమండ్ గ్రూప్... బంగారం, వెండి, వజ్రాల వ్యాపారం, సరఫరా చేసే వివిధ బులియన్ బ్యాంకుల నుంచి బంగారం, వజ్రాలను కొనుగోలు చేసేది.

ఇందులో భాగంగా బ్యాంకింగ్ క్రెడిట్ లైన్‌ను తప్పుగా ఉపయోగించుకుని రుణాలిచ్చే కంపెనీలను మోసగించారు. విన్సమ్ డైమండ్స్ గ్రూపుకు ఇచ్చిన బ్యాంకింగ్ సౌకర్యాలను దుర్వినియోగం చేస్తూ కంపెనీ యజమాని జతిన్ మెహతా న‌గ‌దు లావాదేవీలు జరిపాడు. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో రిజిస్టర్డ్ కంపెనీ అయిన మారెంగో ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ లిమిటెడ్ 16.30 మిలియన్ పౌండ్లను పొందింది. ఇదే సమయంలో యూఏఈ కంపెనీ అయిన‌ అల్-నూరా ఎఫ్‌జెడ్ఈ 650 మిలియన్ డాలర్లను పొందింది. ఆ తర్వాత ఈ రెండు కంపెనీలు మాయ‌మయ్యాయి. ఇలా న‌కిలీ కంపెనీల‌ను ఏర్పాటు చేసి మెహ‌తా ఆ డ‌బ్బు పొందిన‌ట్టు అభియోగాలు న‌మోదు చేశారు.

ఇందులో భాగంగా జతిన్ మెహ‌తా, ఆయ‌న‌ సంస్థలపై అనేక ఆంక్షల‌ను లండ‌న్ కోర్టు విధించింది. మొత్తం 1 బిలియన్ డాలర్ల (భార‌త క‌రెన్సీలో రూ.8500 కోట్లు) కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే త‌న ఆస్తి కేవ‌లం 146 మిలియ‌న్ డాల‌ర్లేన‌ని గ‌తంలో ఆయ‌న తెలిపారు.

మెహతా కుటుంబం నకిలీ క్రెడిట్ లైన్ ఉపయోగించి భారీ కుంభకోణానికి పాల్పడింది. ప్రస్తుతం ఈ కేసులను దాదాపు డజనుకుపైగా న్యాయవాదులు వాదిస్తున్నారు. గతంలో వ‌జ్రాల వ్యాపారులు మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ ఇలాంటి కుంభ‌కోణాల‌కే పాల్ప‌డ్డ సంగ‌తి తెలిసిందే.