Begin typing your search above and press return to search.
తొలకరి స్పెషల్...గుంటూరులో వజ్రాల వర్షం
By: Tupaki Desk | 19 Jun 2018 6:18 AM GMTకోహినూర్ వజ్రం నుంచి పరిచయం అవసరం లేదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్ వజ్రం గోల్కొండ మైన్స్‌గా ప్రసిద్ది చెందిన గుంటూరు జిల్లా బెల్లంకొండలోనే దొరికింది. అప్పుడెప్పుడో దొరికిన వజ్రం గురించి ఇప్పుడలా ఉంచితే...ప్రస్తుతం వజ్రాల వర్షం ఇదే బెల్లంకొండ సమీపంలో కురుస్తోందట. నమ్మలేకున్నారా? నిజంగా నిజం. వానకాలం వచ్చిందంటే దేశమంతా వర్షాలు కురుస్తాయన్నది అందరికీ తెలిసిందే. ఒక్కోసారి వర్షంతోపాటు చేపలు పడటం కూడా మనం చూస్తుంటాం. అయితే గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ మండలంలో తొలకరి వర్షంతో కలిసి వజ్రాలు కురుస్తాయని ప్రజలు నమ్మకం. అలా బలంగా నమ్ముతున్నారు కాబట్టే...స్థానికులే కాదు ఎక్కడెక్కడి నుంచో పలువురు వచ్చి మరీ...వజ్రాల అన్వేషణలో పడిపోయారు.
గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలోని కేతవరం, పులిచింత, చిట్యాల తండా, కొల్లేరు గ్రామాల్లో తొలకరిలో వజ్రాలు కురుస్తాయని కొందరి విశ్వాసం. ఇక్కడి రైతులు పొలాలు దున్నుతుంటే విలువైన రంగురాళ్లు, కొన్నిసార్లు వజ్రాలు ఇక్కడ లభించినట్టు చెప్తారు. రూ.50 వేల నుంచి రూ.50 లక్షల విలువైన వజ్రాలు లభిస్తుంటాయని స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా వజ్రాల వేటలో పలువురు బిజీ అవుతున్నారు. పడుతున్నారు. ఒక్క రాయి దొరికినా రాత్రికి రాత్రి లక్షాధికారి అయిపోవచ్చనే ఆశతో వందల మంది ఈప్రాంతానికి తరలివస్తున్నారు. ఆకాశం నుంచి కురిసే వజ్రాలను ఏరుకోవడం కోసం వందల కుటుంబాలు ఇప్పటికే బెల్లంకొండ మండలానికి చేరుకున్నారు. ఒక్క వజ్రం దొరికినా చాలు రూ. 50 వేలు గ్యారంటీ అనే ప్రచారం విస్తృతమవడంతో చాలామంది ఇక్కడ కురిసే తొలకరి వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలా అక్కడ వజ్రాల వాన కోసం వేసి చూస్తున్నవారి సందడి అంతాఇంతా కాదు.
వజ్రాల వేట కోసం వచ్చేవారు మూడునెలలపాటు బెల్లంకొండ పరిసరాల్లో మకాం వేస్తుంటారు. హైదరాబాద్ - విజయవాడ - పొన్నూరు - రేపల్లె - తెనాలి తదితర ప్రాంతాల నుంచి వచ్చేవారితో గ్రామాలన్నీ కిక్కిరిసిపోతాయి. వర్షం కురిస్తే చాలు ప్రతీఒక్కరు పొలాల్లోకి - అడవుల్లోకి వెళ్లి వెతకడం ప్రారంభిస్తారు. వెంకటాయపాలెంలో ఓ వ్యక్తి తన పొలం దున్నుతుండగా వజ్రం దొరికిందని ఇటీవల విస్తృతంగా ప్రచారం జరిగింది. రకరకాల వార్తలు షికారు చేస్తుండటంతో తొలకరి వర్షం కోసం కోరుకుంటూ వివిధ గ్రామాల నుంచి వచ్చినవారంతా పడిగాపులు కాస్తున్నారు. కాగా, నాణ్యత - రూపం - బరువును బట్టి రంగురాయి విలువను నిర్ధారిస్తారు. ఇక్కడ లభించే వజ్రాలను కొనుగోలుచేసేందుకు హైదరాబాద్ - ముంబై - చెన్నై - బెంగళూరు నుంచి వ్యాపారులు వచ్చి మకాం వేస్తుంటారు.