Begin typing your search above and press return to search.

డైలాగ్ అండ్ డైల‌మా : సంక‌ట స్థితిలో సంఘ నాయ‌కులు

By:  Tupaki Desk   |   7 Feb 2022 4:31 AM GMT
డైలాగ్ అండ్ డైల‌మా : సంక‌ట స్థితిలో సంఘ నాయ‌కులు
X
ఉద్యోగ సంఘాల నాయ‌కులు డైల‌మాలో ఉన్నారు.వారేం చేసినా కూడా, చెప్పినా కూడా ప్ర‌జ‌లు అంగీక‌రించేలా లేరు.అందుకే వాళ్లు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కోరుకున్న ప్ర‌తిసారీ ఎక్క‌డో ఓ చోట విఫ‌లం అవుతూనే ఉన్నారు.తాజాగా పీఆర్సీ విష‌య‌మై కూడా వాళ్లు

ఇదే విధంగా ఫెయిల్ అయి ఉన్నారు. ఉద్యోగ సంఘాలు అయితే తామే గెలిచామ‌ని పైకి చెబుతున్నా కూడా అదంతా అబ‌ద్ధ‌మేన‌ని తేలిపోయింది.ప్ర‌భుత్వ పెద్ద రామ‌కృష్ణా రెడ్డితో జ‌రిపిన చ‌ర్చ‌ల కార‌ణంగానే వీళ్లంతా పెద్ద‌వాళ్ల‌యి పోయారా? లేదా త‌మ మ‌ద్ద‌తు లేకుండానే వీళ్లంతా గొప్ప‌వాళ్లుగా రాణించేస్తున్నారా అన్న సందేహం ఒక‌టి ఉద్యోగుల నుంచి వ్య‌క్తం అవుతోంది. వాస్త‌వానికి ఉద్యోగ సంఘాల నాయ‌కులు వాళ్ల వ‌ర‌కు మాత్ర‌మే స‌మ‌స్య‌ల‌ను ప్రస్తావించి సంబంధిత ప‌రిష్కారం అందుకున్నారు అన్న‌ది నిజం.

కానీ కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, గ్రామ స‌చివాల‌య ఉద్యోగులు, ఇంకా వ‌లంటీర్లు, ఇంకా చాలా మంది దిగువ స్థాయి సిబ్బంది ఉన్నారు క‌దా! వాళ్ల గురించి వీళ్లు మాట్లాడ‌లేదు. కేవ‌లం స‌చివాల‌య ఉద్యోగులు మొదలుకొని ఉపాధ్యాయుల వ‌ర‌కూ ఎవ‌రి ఇబ్బంది వారు చెప్పి త‌మ పంతం నెగ్గించుకునే ప్ర‌య‌త్నం ఒక‌టిచేశారు.అయితే ఈ చ‌ర్చ‌ల్లో కూడా మ‌ట్టి ఖ‌ర్చుల‌ను ఇర‌వై ఐదు వేల రూపాయ‌లుగా నిర్ణ‌యించ‌డం, ప్ర‌తి ఐదేళ్ల‌కూ ఓ సారి పీఆర్సీ వేస్తామ‌ని చెప్ప‌డం, ఇంకా అద్దె భ‌త్యాల‌లో కాస్త స‌వ‌ర‌ణ‌లు చేసి శ్లాబులు నిర్ణ‌యించ‌డం మిన‌హా వీళ్లేం సాధించింది లేద‌ని అందుకే తాము తిరుగుబాటు చేయ‌నున్నామ‌ని కొంద‌రు ఉపాధ్యాయులు ఫేస్బుక్ వేదిక‌గా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇదే సంద‌ర్భంలో ఉద్యోగ సంఘ నాయ‌కులకు ప్ర‌భుత్వం కొన్ని తాయిలాలు ఎర‌వేసి త‌మ‌వైపు లాక్కుంద‌ని కూడా కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఇందుకు ఉదాహ‌ర‌ణ‌లు కూడా చెబుతున్నారు. ఆ రోజు ఎన్జీఓ నేత అశోక్ బాబు చంద్ర‌బాబు హ‌యాంలో ఎలా డ్రామా న‌డిపారో ఇప్పుడు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి అనే ఓ రిటైర్డ్ ఎన్జీఓ లీడ‌ర్ అదేవిధంగా డ్రామా న‌డుపుతున్నారు. మొన్న‌టి దాకా ఎన్జీఓ సంఘ రాష్ట్ర బాధ్యులుగా ఉన్న ఆయ‌న రిటైర్ అయ్యాక జ‌గ‌న్ కోట‌రీలో ప్ర‌భుత్వ స‌ల‌హాదారు అయ్యారు. అదే ఆయ‌న‌కు ప్ల‌స్సూ ఇప్పుడు మైన‌స్సు కూడా! అందుకే ఇప్పుడు చ‌ర్చ‌లు జ‌రిపిన వెంక‌ట్రామి రెడ్డి కానీ బండి శీను కానీ ఇంకా ఇత‌ర నాయ‌కులు ఎవ్వ‌ర‌యినా కానీ గ‌తంలో వీరంతా జ‌గ‌న్ కు అనుబంధంగా ఉన్న వ్య‌క్తులే అని అందుకే వాళ్లు ప్ర‌భుత్వం చెప్పిన విధంగా మాట్లాడుతున్నార‌ని, ఫ‌లితంగా తాము అనుకున్న‌వి ముఖ్యంగా చీక‌టి జీవోల ఉప‌సంహ‌ర‌ణ అన్న‌ది చేయించ‌లేక‌పోయామ‌ని అంటున్నారు వీరంతా! కాంట్రాక్టు లెక్చ‌రర్ల‌తో స‌హా చాలా మంది కూడా ఇవాళ అసంతృప్తిలోనే ఉన్నారు.

ఎందుకంటే కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు ఇవాళ ఉద్యోగ భ‌ద్ర‌త లేదు. టైం స్కేలు ప్ర‌కారం జీతాల చెల్లింపు లేదు.స‌మాన ప‌నికి స‌మాన వేతనం అన్న నియ‌మం అస్స‌లు అమ‌లులో లేదు. ఇటువంటి త‌రుణంలో వీరి గోడు ప‌ట్టించుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది.అంతేకాదు సీపీఎస్ ర‌ద్దుకు సంబంధించి కూడా క్లారిఫికేష‌న్ లేదు.ఇవ‌న్నీ ఇవాళ జ‌గ‌న్ ను ఇంకా ఇంకొంద‌రిని మ‌ళ్లీ మ‌ళ్లీ వేధించే స‌మ‌స్య‌లే! ఇప్ప‌టికీ జిల్లాలలో డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్లకు జీతాలే లేవు. మ‌రి! వాళ్లు ఉద్యోగులు కాదా? వారి గోడు ఎవ‌రికి చెప్పుకోవాలి?వీటిపై దృష్టి అన్న‌ది సారించ‌కుండా కేవ‌లం త‌మ అవ‌స‌రాల మేర‌కే ఆ నలుగురు మాట్లాడ‌డం త‌గ‌ద‌ని ఉద్యోగులు మ‌రియు ఉపాధ్యాయులు గ‌గ్గోలు పెడుతున్నారు. పైన పేర్కొన్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్ సానుకూలంగా ప‌రిష్క‌రించాల్సిన అవ‌స‌రం మ‌రియు ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది.