Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: ధూళిపాళ్ల అరెస్టు.. తెల్లవారుజామున వంద మంది పోలీసులతో

By:  Tupaki Desk   |   23 April 2021 3:56 AM GMT
బ్రేకింగ్: ధూళిపాళ్ల అరెస్టు.. తెల్లవారుజామున వంద మంది పోలీసులతో
X
కరోనా కలకలం రెండు తెలుగు రాష్ట్రాల్ని కుదిపేస్తున్న వేళ.. జనం వైద్యసాయం కోసం అర్రులు జాస్తున్న సందర్భంలో.. అందుకు భిన్నంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామం షాకింగ్ గా మారింది. ఒకవైపు మాజీ మంత్రి దేవినేని ఉమ పైన నమోదైన కేసులో ఆయన కోసం పోలీసులు వెతుకుతుంటే.. అందుకు భిన్నంగా ఈ రోజు తెల్లవారుజామున మరో టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ పోలీసులు అరెస్టు చేయటం సంచలనంగా మారింది.

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణానికి కూతవేటు దూరంలో ఉండే ధూళిపాళ్ల నరేంద్ర సొంతూరు చింతలపూడిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తెల్లవారుజామున ఐదు గంటల వేళలో దాదాపు వందకు పైగా పోలీసులు ధూళిపాళ్ల నివాసాన్ని చుట్టుముట్టారు. దీంతో..అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

ఇదిలా ఉంటే.. సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయని నరేంద్రపైన ఏసీబీ కేసు నమోదు చేసింది. సెక్షన్ 408, 409, 418, 420, 465, 471, 120బీ, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు కావటం గమనార్హం. సీఆర్ పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర సతీమణికి కూడా నోటీసులు జారీ చేశారు. నరేంద్రకునోటీసులు ఇచ్చిన సందర్భంలో అతడిపై మోపిన అభియోగాలు నాన్ బెయిల్ బుల్ గా పేర్కొన్నారు.

సంగం డెయిరీకి సంబంధించిన కేసులోనే నరేంద్రను అరెస్టు చేసినట్లుగా చెబుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెల్లడి కావాల్సి ఉంది. ఈ అనూహ్య పరిణామం విపక్ష టీడీపీని కుదిపేసింది. ఇక.. నరేంద్ర స్వగ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా.. పోలీసులు భారీగా మొహరించారు. ఒక మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసేందుకు తెల్లవారుజామున అంత హడావుడి చేయాల్సిన అవసరం ఏమిటన్న విమర్శ వినిపిస్తోంది. కరోనా వేళలో.. మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. ముందుస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలా అరెస్టు చేసి తరలించటం ఏమిటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.