Begin typing your search above and press return to search.

మహీ రిటైర్మెంట్ ప్రకటించింది ఆ కారణం వల్లే...

By:  Tupaki Desk   |   16 Aug 2020 3:45 AM GMT
మహీ రిటైర్మెంట్ ప్రకటించింది ఆ కారణం వల్లే...
X
భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని ఆకస్మికంగా తన రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను కలవరపాటుకు గురి చేశాడు. 'కెరీర్‌ అంతా నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని ధోని ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో పెట్టాడు. ధోని వీడియో పెట్టగానే అభిమానులు అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మరి కొంతకాలం ధోని ఆటగాడిగా అలరిస్తాడనుకుంటున్న అభిమానుల ఆశలను అడియాశలు చేస్తూ ధోని ఆట నుంచి తప్పుకున్నాడు.

అసలు ధోని ఇప్పటికిప్పుడు అంత ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ అభిమానులు కారణాలు వెతకడం ప్రారంభించారు. వాస్తవానికి ధోని ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకోలేదు. 2019 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనలే ధోని ఆడిన చివరి మ్యాచ్. ఆ మ్యాచ్ టార్గెట్ పెద్దది కాకపోయినా, చేతిలో బంతులు ఉన్నా ధోని చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో బాల్స్ తరిగిపోయి మ్యాచ్ ఓటమికి దారి తీసిందనే ఆరోపణలు ఉన్నాయి.

మ్యాచ్ చివరి వరకు నెమ్మదిగా ఆడిన ధోని ఆ తర్వాత వేగం పెంచి తన స్టైల్లో విజయాన్ని అందిస్తాడని అంతా భావించారు. అయితే దురదృష్టవశాత్తు ధోని రన్ ఔట్ అయి క్రిజ్ నుంచి వెనుదిరిగాడు. దీంతో కోట్లాది మంది భారతీయులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆ మ్యాచ్లో భారత్ ఓడిపోయి ఇంటి బాట పట్టింది. ఆ తర్వాత మళ్ళీ ధోని క్రికెట్ మ్యాచ్ ఆడలేదు. అప్పటి నుంచి ఇక ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తారని అందరూ అనుకోవడం ప్రారంభమైంది. అయితే ధోని మదిలో రిటైర్మెంట్ ఆలోచన లేదని, ఐపీఎల్ లో సత్తా చాటి మళ్లీ జట్టులోకి వచ్చి ఈ ఏడాది ఆఖరున జరిగే ట్వంటీ-20 వరల్డ్ కప్ లో ఆడి మరోసారి భారత్ కు కప్పు అందించాలని భావించాడు. అయితే కరోనా కారణంగా టీ -20 వరల్డ్ కప్ వాయిదా పడింది. ఇక రిటైర్మెంట్ ప్రకటించడమే మేలని భావించిన ధోని ఆట నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.