Begin typing your search above and press return to search.

నిన్న కాంగ్రెస్ లో చేరిక.. నేడు రాజీనామా.. షాకిచ్చిన డీఎస్.. ఏమైంది?

By:  Tupaki Desk   |   27 March 2023 9:57 PM GMT
నిన్న కాంగ్రెస్ లో చేరిక.. నేడు రాజీనామా.. షాకిచ్చిన డీఎస్.. ఏమైంది?
X
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ ఊహించని షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ రాజ్యసభ పదవీ కాలం పూర్తయ్యి అనారోగ్యంతో రాజకీయాలకు పూర్తి దూరంగా ఉంటున్నారు. ఆదివారం కాంగ్రెస్ గూటికి చేరారు. గాంధీభవన్ వచ్చిన డీఎస్ కు, ఆయన కుమారుడు సంజయ్ కు కాంగ్రెస్ కండువా కప్పి ఫొటోలు రిలీజ్ చేశారు. వారిద్దరూ కాంగ్రెస్ లో చేరారని నేతలు ప్రకటించారు.

అయితే ఒక్కరోజు కూడా గడువక ముందే హస్తం పార్టీకి రాజీనామా చేసి డీఎస్ షాకిచ్చారు. ఆయన సతీమణి విజయలక్ష్మి కూడా మరో లేఖను విడుదల చేశారు. మొదటి నుంచి కాంగ్రెస్ వాది అయిన డీఎస్.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు ధర్మపురి సంజయ్ టీఆర్ఎస్ లో చేరారు. ఇక మరో కుమారుడు ధర్మపురి అరవింద్ మాత్రం మొదటి నుంచి బీజేపీలో ఉంటూ ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు.

తండ్రి ఒక పార్టీలో.. కుమారుడు మరో పార్టీలో ఉంటూ వస్తున్నారు. ఇలా చాలా రోజులు డీఎస్ కుటుంబంలో చేరికల చిచ్చు నడుస్తోంది. ఆ మధ్య రెండు, మూడేళ్ల పాటు డీఎస్ పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన మళ్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్లీ సొంతగూటికి డీఎస్ చేరుకున్నారు.

డీఎస్ రాకను కాంగ్రెస్ ఆహ్వానించినా.. ఆక్ష్న కుమారుడు ధర్మపురి సంజయ్ చేరిక ప్రతిపాదనపైన నిజామాబాద్ కాంగ్రెస్ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని సమాచారం. అయితే కుమారుడు సంజయ్ భవిష్యత్ దృష్ట్యానే కొడుకుతోపాటు గాంధీభవన్ కు వచ్చిన డీఎస్ రేవంత్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జి మానిక్ రావు ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే పార్టీలో చేరిన కొన్ని గంటల్లోనే తాను రాజీనామా చేస్తున్నట్టు లేఖ విడుదల చేశారు.

అయితే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా మీడియాలో ప్రచారం రావడంతో ఆయనకు నిన్న రాత్రి ఫిట్స్ వచ్చాయట.. ఈ మేరకు ఆయన భార్య ఈ పరిణామాలపై ఆందోళన చెందుతూ లేఖ విడుదల చేశారు. ఈ క్రమంలోనే నా వయసు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని.. పార్టీలో నా చేరికకు, నాకుమారుడు సంజయ్ కు టికెట్ కు ముడిపెట్టవద్దని కోరారు. ఆరోగ్య రీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని.. వివాదాల్లోకి లాగవద్దంటూ డీఎస్ తాను కాంగ్రెస్ కు తాజాగా రాజీనామా చేస్తున్నట్టు ఓ లేఖను అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు.

24 గంటల వ్యవధిలోనే డీఎస్ కుటుంబంలో ఏదో ఏం జరిగిందో తెలియట్లేదు. సడన్ గా ఆయన రాజీనామా మాత్రం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. కాగా.. క్రియాశీలక రాజీకాయాలకు దూరంగా ఉండాలని డీఎస్ నిర్ణయించుకున్నట్లు దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఈ రాజీనామాపై కాంగ్రెస్ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో వేచిచూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.