Begin typing your search above and press return to search.

సొంత గూటికి డీఎస్, సంజయ్

By:  Tupaki Desk   |   26 March 2023 12:40 PM GMT
సొంత గూటికి డీఎస్, సంజయ్
X
వైఎస్ఆర్ హయాంలో ఉమ్మడి ఏపీలో పీసీసీ చీఫ్ గా చక్రం తిప్పిన డీఎస్ ఇప్పుడు అధికారికంగా బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. కానీ కేసీఆర్ ఎప్పుడో ఈయనను వెలివేశారు. ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా పలుమార్లు బీజేపీకి దగ్గరగా వెళ్లారు. కానీ ఇప్పుడు సొంతగూటికి చేరారు.

సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ తోపాటు ఆయన తనయుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావ్ ఠాక్రే కూడా పార్టీలోకి ఆహ్వానించారు.

కొంతకాలంగా కాంగ్రెస్ లో చేరడానికి డీఎస్ సానుకూలంగా ఉన్నా.. సంజయ్ చేరికపై మాత్రం సందిగ్ధత నెలకొంది. డీఎస్ తనయుడి చేరికను జిల్లా కాంగ్రెస్ నాయకత్వం వ్యతిరేకించింది. అయితే తండ్రి చొరవతో సంజయ్ చేరికకు మార్గం సుగమమైంది. గతంలో డీఎస్ తోపాటు సంజయ్ బీఆర్ఎస్ లో చేరారు. గత కొద్దికాలంగా బీఆర్ఎస్ కు సంజయ్ దూరంగా ఉంటున్నారు.

కాగా డీఎస్ కాంగ్రెస్ లో చేరికపై ట్విస్ట్ చోటుచేసుకుంది. కాంగ్రెస్ లో చేరడం లేదంటూ ముందుగా డీఎస్ పేరుతో ఓ లేఖ విడుదలైంది. ఆ తర్వాత కాసేపటికే కాంగ్రెస్ లో చేరుతున్నట్టు డీఎస్ స్వయంగా ప్రకటించారు. వీల్ చైర్ లో గాంధీ భవన్ కు వచ్చిన డీఎస్ ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు.

కాంగ్రెస్ లో చేరడానికే గాంధీ భవన్ కు వచ్చానని.. రాహుల్ కు మద్దతుగా నిలబడనున్నట్టు డీఎస్ తెలిపారు. ఈ మేరకు ఆయన పేరిట ఒక లేఖ విడుదలైంది. నేను కాంగ్రెస్ వ్యక్తిని.. నన్ను కాంగ్రెస్ లోకి ఎవరో చేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ పేర్కొన్నాడు. మొత్తంగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, బీజేపీలోకి వెళ్లి తిరిగి సొంతగూటికి డీఎస్ చేరడం విశేషం.