Begin typing your search above and press return to search.

తెలంగాణలో రాష్ట్రపతి పాలనంటూ బాంబు పేల్చిన అరవింద్

By:  Tupaki Desk   |   2 Nov 2020 7:50 AM GMT
తెలంగాణలో రాష్ట్రపతి పాలనంటూ బాంబు పేల్చిన అరవింద్
X
తెలంగాణలో ఇప్పుడు అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. దుబ్బాక ఎన్నికలు ఈ అగ్నికి ఆజ్యం పోశాయి. గెలుపు కోసం టీఆర్ఎస్, బీజేపీలు కొదమ సింహాల్లా ఢీకొంటున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థికి చెందిన డబ్బులను పోలీసులు సీజ్ చేయడం.. ప్రతిగా బీజేపీ ఆందోళనలతో తెలంగాణ అట్టుడుకుతోంది. ఈ హీట్ ను మరింత పెంచుతూ నిన్న బీజేపీ కార్యకర్త హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోసం ఆత్మాహత్యాయత్నం చేయడం సంచలనమైంది.

తాజాగా మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ అడ్డాగా భారీ కుట్రకు బీజేపీ ప్లాన్‌ చేసిందని ఆరోపించారు. ఈరోజు బీజేపీ ఆఫీస్ ముందు పార్టీ కార్యకర్తలతో హైడ్రామా చేశారని.. దీనికి కొనసాగింపుగా రేపు హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధం అవుతున్నారని అన్నారు. రేపు లాఠీఛార్జి, లేదంటే ఫైరింగ్ జరిగేలా బీజేపీ ప్లాన్ చేస్తోందన్నారు. దుబ్బాకలో బీజేపీ ఎన్నో ఎత్తుగడలు, కుట్రలు చేసిందని ఆరోపించారు. మొదట డబ్బుల ప్రయోగం చేయగా ఇప్పటికే చాలా సార్లు డబ్బులు పట్టుబడ్డాయన్నారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కౌంటర్ ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలపై కాల్పులు జరిపితే అది టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహించిన హింస అవుతుందని.. కాల్పులు, లాఠిచార్జి జరుపుతామని బీజేపీని బెదిరిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. అదే జరిగితే తెలంగాణలో రాష్ట్రపతి పాలన వస్తుందని గుర్తుంచుకోవాలని కేటీఆర్ ను హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.

నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో ఆడుతూ పాడుతూ కవితను ఓడించిన మేము.. దుబ్బాక ఎన్నికల కోసం లాఠీచార్జి చేయించుకోవడం.. కార్యకర్తల రక్తం చిందించుకునే స్థాయికి దిగజారుతామా అని అరవింద్ అన్నారు. సిద్దిపేటలో బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికమని అన్నారు. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారిని నియమించిందని అన్నారు. దుబ్బాకలో ఓడిపోతామన్న భయంతోనే కేటీఆర్ అక్కడికి వెళ్లడం లేదని ఆరోపించారు. దుబ్బాకలో ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ ధరణి, రైతు వేదికల పేరిట ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.