Begin typing your search above and press return to search.

మంత్రి రేసులో ఉన్నారు కానీ.. అక్కడ షాకేనా...?

By:  Tupaki Desk   |   1 Feb 2022 2:30 AM GMT
మంత్రి రేసులో ఉన్నారు కానీ.. అక్కడ షాకేనా...?
X
మంత్రి పదవి కావాలని ఆయన గట్టిగా కోరుకుంటున్నారు. తాను మంత్రి అయితే ఎన్నికల వేళ ఆ అధికార బలంతో మరోమారు గెలవాలని చూస్తున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్ లో సీన్ మాత్రం షాక్ కొట్టేలా ఉందని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు అంటే సీనియర్ మోస్ట్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. శ్రీకాకుళం జిల్లాలో మూడున్నర దశాబ్దాలుగా రాజకీయ చక్రం తిప్పుతున్న నేత.

ఆయన 2019లోనే మంత్రి కావాలి. కానీ సోదరుడికి పదవి ఇచ్చి జగన్ ఆయన్ని అలా ఉంచేశారు. ఇక ఆదిలో ఆయన బాగా అసంతృప్తికి లోను అయినా కానీ కాలం గడచే కొద్దీ ఉందిలే మంచి కాలమని సర్దిచెప్పుకున్నారు. ఇక గత కొంతకాలంగా విస్తరణ అని వినిపిస్తోంది. దాంతో ఈసారి గ్యారంటీ అని ధర్మాన అనుచరులు అయితే బాగా ఆశ పడుతున్నారు. పెద్దాయనను మంత్రిగా చూడడమే తరువాయి అని వారు అనుకుంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే శ్రీకాకుళంలో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది అంటే వెరీ బ్యాడ్ అని చెబుతున్నారుట. అలాగే, టీడీపీ బాగా పుంజుకుంది అని సమాధానం వస్తోందిట‌. మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీ దేవి బాగా పట్టు సంపాదించారు. ఇంకో వైపు శ్రీకాకుళంలోనే ఎంపీ రామ్మోహననాయుడు ఉంటారు. ఆయన కంటూ సొంత బలం ఉంది. ఇవన్నీ కలసి సైకిల్ జోరు శ్రీకాకుళం పట్టణంలో గట్టిగానే ఉంది.

2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ధర్మాన ప్రసాదరావు పోటీ చేసినా దాదాపు పాతిక వేల ఓట్ల భారీ తేడాతో టీడీపీ చేతిలో ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్ల జగన్ వేవ్ బలంగా వీచినా కేవలం అయిదు వేల ఓట్ల తేడాతో బయటపడ్డారు. ఇక 2004లో శ్రీకాకుళంలో ఎంట్రీ ఇచ్చిన ధర్మాన ఇప్పటికి మూడు సార్లు గెలిచారు. అదే గుండా అప్పలసూర్యనారాయణ నాలుగు సార్లు, ఆయన సతీమణి లక్ష్మీదేవి ఒకసారి గెలిచారు. 1983 నుంచి చూసుకుంటే టీడీపీ ఆరుసార్లు ఇక్కడ విజయపతాక ఎగరేసింది.

అలాంటి కంచుకోట లాంటి సీట్లో ఈసారి మాజీ మంత్రికి గెలుపు కష్టమే అంటున్నారు. వైసీపీకి అందిన సమాచారం కూడా ఇదే అని చెబుతున్నారు. ఎపుడు ఎన్నికలు జరిగినా శ్రీకాకుళంలో వైసీపీ ఓడే ఫస్ట్ సీటు ఇదే అని కూడా చెబుతున్నారు. అయితే ధర్మాన మంత్రిగా ఉంటే వచ్చే ఎన్నికల్లో రాజకీయ పరిస్థితులు మారి గెలిచే అవకాశాలు ఉంటాయని ఆయన వర్గం ధీమాగా ఉంది. మరి ఓడిపోయే సీట్లలో ఒకటి అని తెలిసాక వైసీపీ ఇక్కడ నుంచి మంత్రిగా ఆయన్ని చేస్తుందా అన్నదే పెద్ద డౌట్ గా ఉందిట. చూడాలి మరి ఏం జరుగుతుందో.