Begin typing your search above and press return to search.

చంద్రబాబు పేల్చే వరకు ఎందుకు.. మనమే పేల్చేద్దాం: వైసీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   6 Feb 2023 2:02 PM GMT
చంద్రబాబు పేల్చే వరకు ఎందుకు.. మనమే పేల్చేద్దాం: వైసీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
X
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ నేతలు ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. టీడీపీ గెలిస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని, వలంటీర్, సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తున్నారని ఇప్పటికే వైసీపీ నేతలు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రతిపక్షాలు వలంటీర్లను వైసీపీ ప్రభుత్వం అనైతిక కార్యకలాపాలకు వాడుకుంటోందని, వీరి వల్ల రహస్యంగా ఉండాల్సిన ప్రజల సమాచారం కులాలవారీగా ప్రభుత్వానికి చేరుతోందంటూ విమర్శలు చేస్తున్నాయి.

తాజాగా ఈ కోవలో ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాట్‌ కామెంట్స్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా సతివాడలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వలంటీర్లను రెచ్చగొట్టేలా మాట్లాడారని అంటున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మొదటి వేటు వలంటీర్లపై వేస్తోందని ధర్మాన హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తుపాకీతో మీపైన పేలోలోపే మీరే ఆయనను పేల్చాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

వలంటీర్లు ఊరకే ఎవరికీ భయపడవద్దని ధర్మాన ప్రసాదరావు అన్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలకు అస్సలు భయపడవద్దని చెప్పారు. ప్రభుత్వం ఏం చేస్తోందో, ఏ పార్టీ తప్పుచేస్తోందో వలంటీర్లు చెబితే తప్పేంటని ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించడం గమనార్హం. వలంటీర్లు కూడా రాష్ట్ర పౌరులేనన్నారు. మంచి ప్రభుత్వం కోసం ప్రచారం చేసే అవకాశం వలంటీర్లకు లభించిందన్నారు.

రాష్ట్రంలో ఓటర్లను వలంటీర్లు మంచి డైరెక్షన్‌ లో తీసుకెళ్లాలని ధర్మాన ప్రసాదరావు వలంటీర్లకు సూచించడం గమనార్హం. చంద్రబాబు అధికారంలోకి వచ్చి వలంటీర్లను తొలగించక ముందే వలంటీర్లే ఆయన్ను అధికారంలోకి రానివ్వకుండా చూడాలని ధర్మాన పిలుపునివ్వడం గమనార్హం.

ఇప్పటికే వలంటీర్లను వైసీపీ కార్యక్రమాలకు వాడుతున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కొంతమంది వలంటీర్ల పనితీరు కూడా వివాదస్పదమైంది. ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కూడా వలంటీర్లను ఎన్నికల విధుల్లో, వైసీపీ పార్టీ కార్యక్రమాలకు వినియోగించకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయినా ఈ ఆదేశాలను ధిక్కరించి వైసీపీ నేతలు వలంటీర్ల వ్యవస్థను తమ సొంత పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఇప్పుడు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సైతం అలాంటి వ్యాఖ్యలే చేయడం వివాదం రేపుతోంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే తుపాకీతో వలంటీర్లను పేల్చేయడం ఖాయమని.. అందుకే ఆ లోపే ఆయన అధికారంలోకి రాకుండా ఆయనను మనమే తుపాకీతో పేల్చేద్దామని ధర్మాన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎంతదూరం వెళ్తాయో వేచిచూడాల్సిందే!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.