Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వంపై ధర్మాన కీలక వ్యాఖ్యలు ... సమర్ధించిన స్పీకర్ తమ్మినేని !

By:  Tupaki Desk   |   8 July 2020 11:15 AM GMT
ఏపీ ప్రభుత్వంపై ధర్మాన కీలక వ్యాఖ్యలు ... సమర్ధించిన స్పీకర్ తమ్మినేని !
X
ఆంధ్రప్రదేశ్‌ లో కొత్త జిల్లాల ఏర్పాటుకి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. రాష్ట్రంలోని ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కో జిల్లాగా ప్రకటించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ముందుకెళ్తున్న వైఎస్ జగన్ సర్కార్ ఇప్పుడు జిల్లాల సంఖ్యను పెంచేందుకు యోచిస్తోంది. దీనిపై ఇప్పటికే అధికారులతో పలు దఫాల్లో చర్చలు కూడా జరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలు ఉన్నాయి. ఏపీలో మొత్తం 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు లో పార్లమెంట్ నియోజవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకోనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు పై జూన్ చివర్లో కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో సీఎం జగన్ తన వైఖరిని స్పష్టం చేసారు.

అయితే , ఒక్కో పార్లమెంట్ నియోజకవవర్గాన్ని ఒక్కో జిల్లాగా చేయబోతున్నారు అన్న వార్తలపై వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ను స్వాగతిసున్నాం అంటూనే , పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన సరికాదు అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. జిల్లాల ఏర్పాటులో ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, లేదంటే పార్టీకి భారీ నష్టం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కాకుండా .. ఏరియా వైజ్ గా పరిగణలోకి తీసుకోని జిల్లాలని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని తెలిపారు. ఎచ్చెర్ల , రాజాం , పాలకొండ లేని జిల్లాను ఊహించుకోవడం చాలా కష్టం అని , అలాగే అవసరమైతే ప్రజాప్రతినిధులతో కలిసి పోరాటానికి సిద్ధం అని , ఆదివాసీ జిల్లా ఏర్పాటు కంటే పరిపాలన అందరికి అందుబాటులోకి తీసుకోవాలని తెలిపారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాల ఏర్పాటు పై సీఎం జగన్ మరోసారి పునరాలోచించాలని కోరారు. ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు సమర్ధించారు.